ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన లేఅప్స్ నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు మహమ్మారి పోయి 5 ఏళ్లు దాటినా ఇంకా ఉద్యోగ తొలగింపులు మాత్రం ఆగడం లేదు.ఇక ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లలో తొలగింపులు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండాను అకస్మాత్తుగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.
మహమ్మారి తర్వాత నుంచి కంపెనీలు అన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ఏడాదికేడాది పరిస్థితులు చక్కబడుతూ వచ్చినప్పటికీ ఇంకా ఆర్థిక మాంద్యంలోనే కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక ముందు ముందు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో దిగ్గజ కంపెనీలన్నీ కాస్ట్ కటింగ్ ప్రారంభించాయి.
తాజాగా ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ వీడియో కాల్ ద్వారా ఉద్యోగులు అందర్నీ తొలగించిన సంఘటన షాక్‌కు గురిచేసింది. ఒక భారతీయ ఐటీ స్టార్టప్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తన రెడ్డిట్ సైట్‌లో ఈ సమాచారాన్ని ప్రచురించారు. అతను పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే ఆ రోజు మాకు అకస్మాత్తుగా CEO అత్యవసర సమావేశం ఉందని చెప్పినప్పుడు మేము మా పని దినాన్ని ప్రారంభించాము. నాతో పాటుగా మిగతా సహోద్యోగులంతా వీడియో కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నాము.

సీఈఓ అకస్మాత్తుగా బాంబు పేల్చాడు.. కంపెనీ వద్ద తగినంత నిధులు లేవని.. కాబట్టి ఈ నెల మీకు జీతం రాదు. రేపటి నుండి ఎవరూ పనికి రావొద్దని చెప్పుకొచ్చాడు. అకస్మాత్తుగా మన కంపెనీలో పెట్టిన పెట్టుబడిదారులందరూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అదే కంపెనీని మూసివేయడానికి కారణమని సీఈఓ మాతో చెప్పినట్లు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.
నాకు తెలిసిన కంపెనీలలో మీకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎంత మందికి ఉద్యోగాలు దొరుకుతాయో నేను ఖచ్చితంగా చెప్పలేను" అని CEO అన్నట్లుగా పోస్టులో తెలిపాడు. మీరు ఇంతకు ముందు ఎన్నడైనా ఇలాంటి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నారా.. ఒక వేళ ఎదుర్కుని ఉంటే దాన్ని ఎలా అధిగమించాలో చెప్పండని నెటిజన్లను ఆ ఉద్యోగి కోరాడు. ఆ ఉద్యోగి పెట్టిన పోస్ట్ పై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
గత నవంబర్ లో నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను.. మా CEO కూడా అదే కారణంతో అందరినీ తొలగించారు. లేఆఫ్ ప్రకటన నుండి కోలుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది. అప్పటి నుండి, నేను కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాను. ప్రస్తుతం వేరే ఉద్యోగంలో పనిచేస్తున్నాను. మీరు మీ ఆశ కోల్పోకండి. గట్టిగా ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది అని ఒక నెటిజన్ తెలిపారు.
మరో యూజర్ గత నెలలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని..మీరు ఓడిపోకుండా ప్రయత్నిస్తూ ఉండండి. ప్రతిచోటా అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆశను కోల్పోకండని అన్నారు. మరొక యూజర్, ఇది ఖచ్చితంగా కష్టమైన సమయం. మీరు జీవితంలో పోరాడండి, తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపాడు.


Click it and Unblock the Notifications