Stand Up India రికార్డులు.. రూ.40 వేల కోట్ల రుణాల వితరణ.. 2025 వరకు
Stand Up India: దేశంలో అట్టడుగు స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పన కోసం స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ తీసుకురావటం జరిగింది. వారి ప్రోత్సాహం కోసం భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 5, 2016లో స్కీమ్‌ను తీసుకొచ్చింది.
గడచిన 7 ఏళ్ల కాలంలో ఈ స్కీమ్ ద్వారా 1,80,000 మంది పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారు. ఈ క్రమంలో రూ.40,000 కోట్లను రుణాల రూపంలో మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. కేంద్రం విజయవంతమైన ఈ పథకాన్ని 2019-20లో 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మెుదటి ఆరేళ్ల కాలంలో ఈ స్కీమ్ కింద రూ.30,160 కోట్లను రుణాలుగా మంజూరు చేయగా.. కేవలం ఒక్క సంవత్సరంలో దాదాపు రూ.10,000 కోట్లను అర్హులకు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది.

పథకం కింద ప్రయోజనం పొందిన మెుత్తం 1,80,000 మందిలో లబ్ధిదారుల్లో ఎక్కువ మంది అంటే 1,44,787 మంది మహిళలు కావటం విశేషం. లబ్ధిదారుల్లో 26,889 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు, 8,960 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో మహిళకు రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పించబడింది. మ్యానుఫ్యాక్చురింగ్, సర్వీస్, ట్రేడింగ్, అగ్రికల్చర్ అనుబంధ కార్యకలాపాలకు ఈ సౌకర్యం ఉంది.
కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద రుణాన్ని పొందేందుకు సదరు వ్యాపారి 51 శాతం వాటాలను కలిగి ఉండటం ప్రధాన అర్హతల్లో ఒకటి. స్కీమ్ కింద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రుణాన్ని పొందాలనుకుంటున్న ఎస్సీ, ఎస్టీ లేదా మహిళా పారిశ్రామికవేత్త వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కవగా ఉండాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications