Adani News: లంకతో అదానీ పవర్ ఫుల్ బంధం.. పట్టాలెక్కిన 20 ఏళ్ల పక్కా డీల్
Srilanka News: దేశంలో విద్యుత్ తయారీ కంపెనీలకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగానే కాకుండా ఇరుగుపొరుగు దేశాలకు సైతం విద్యుత్‌ను విక్రయిస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నాయి. దీంతో ప్రముఖ వ్యాపారవేత్తలందరూ పవర్ కంపెనీలను చేజిక్కించుకునేందుకు వెంట పడుతున్నారు. ఈ సమయంలో గౌతమ్ అదానీ కంపెనీని కీలక డీల్ వరించింది.
తన ఈశాన్య ప్రాంతంలో 484 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధి కోసం ద్వీప దేశం శ్రీలంక అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ మధ్య 20 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ఆమోదించింది. ప్రతి కిలో వాట్/గంటకు 0.0826 డాలర్లను టారిఫ్ రేటుగా నిర్ణయించారు. ప్రస్తుత మారకపు రేటుపై స్థానిక రూపాయలలో ఈ పేమెంట్ చెల్లించాల్సి ఉంది అని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి కాంచన విజేసేకర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X పోస్ట్‌లో తెలిపారు.

ప్రస్తుత సగటు ఇంధన ధర కిలోవాట్/గంటకు 39.02 శ్రీలంక రూపాయలకు కంటే ఈ విద్యుత్ కొనుగోలు ఖర్చు తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. క్యాబినెట్ నోట్ ప్రకారం మన్నార్ మరియు పూనేరిన్‌లలో 484 మెగా వాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి ఇప్పటికే మార్చి 2022లో క్యాబినెట్ ఆమోదం లభించింది.
'అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం లభించిన తర్వాత, ఆ కంపెనీ అందించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనపై చర్చించడానికి ప్రభుత్వం ఓ కేబినెట్ కమిటీని నియమించింది. దాని సిఫార్సుల ఆధారంగా చివరి ధర 0.0826 USDగా అంగీకరించి విద్యుత్ శాఖ మంత్రి పంపిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది' అని మంత్రి వెల్లడించారు.


Click it and Unblock the Notifications