Sridhar vembu: సాఫ్ట్‌వేర్ రంగం కనుమరుగవుతుందా? శ్రీధర్ వెంబు సంచలన విశ్లేషణ!
సాఫ్ట్‌వేర్ రంగంలో ఇప్పుడు ఒకటే చర్చ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు ఉంటాయా? కంపెనీలు మనుగడ సాగిస్తాయా? దీనిపై తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా జోహో (Zoho) అధినేత శ్రీధర్ వెంబు, టెక్ నిపుణుడు ది వాల్యుయిస్ట్ (TheValueist) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

24 నెలల్లో సాఫ్ట్‌వేర్ రంగం తలకిందులు?
ది వాల్యుయిస్ట్ (TheValueist) అనే టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక షాకింగ్ పోస్ట్ చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. వచ్చే 24 నెలల్లో సాఫ్ట్‌వేర్ తయారీ విధానం పూర్తిగా మారిపోతుంది. 'Clawdbot' వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ (AI) టూల్స్ వల్ల ఇకపై కోడింగ్ రాయడానికి పెద్ద పెద్ద టీమ్స్ లేదా ఆఫ్- షోర్ డెవలప్‌మెంట్ టీమ్స్ అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. కేవలం సాధారణ ఎంఎస్ ఆఫీస్ (MS Office) నైపుణ్యాలు ఉన్నవారు కూడా ఇంగ్లీష్‌లోనే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయవచ్చని, అది ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్ వరకు అన్నీ చూసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
శ్రీధర్ వెంబు స్పందన: SaaS బుడగ పేలిపోతుందా?
ఈ చర్చపై జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు (Sridhar vembu) తనదైన శైలిలో స్పందించారు. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) రంగంలో ప్రస్తుతం ఉన్న మోడల్ అంత సుస్థిరమైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
• ఖర్చు ఎక్కడ జరుగుతోంది?: చాలా SaaS కంపెనీలు ఇంజనీరింగ్ కంటే మార్కెటింగ్, సేల్స్ కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని.. ఇది చాలా కాలం సాగదని ఆయన హెచ్చరించారు.
• AI ఒక సూది లాంటిది: గాలి నింపిన బెలూన్‌లా ఉన్న SaaS ఇండస్ట్రీని AI అనే సూది వచ్చి పేల్చేస్తోందని ఆయన పోల్చారు. స్టాక్ మార్కెట్ కూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీల భవిష్యత్తుపై అనుమానంతో ఉందని చెప్పారు.
జోహో పరిస్థితి ఏంటి?
మరి ఇంతటి AI విప్లవంలో 'Zoho' లాంటి దిగ్గజ కంపెనీలు తట్టుకోగలవా? అనే ప్రశ్నకు వెంబు చాలా ధైర్యంగా సమాధానం ఇచ్చారు. "నేను మరణాన్ని ప్రశాంతంగా ఊహించుకోమని మా ఉద్యోగులకు చెబుతుంటాను. ఎప్పుడైతే మనం ఓటమిని లేదా అంతాన్ని అంగీకరిస్తామో.. అప్పుడు మనలో భయం పోతుంది. అప్పుడే మనం కొత్త దారులను వెతకగలం" అని ఆయన వ్యాఖ్యానించారు.
మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో AI వల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ మార్పులు రాబోతున్నాయని అర్థమవుతుంది. ఈ ఏఐ యుగంలో కేవలం మారుతున్న కాలానికి అనుగుణంగా అప్ డేట్ అయ్యే కంపెనీలు మాత్రమే నిలబడతాయి. కాబట్టి కంపెనీలు, ఉద్యోగులు ఇప్పట్నుంచే కొత్త స్కిల్స్ పై ఫోకస్ పెట్టడం ముఖ్యం.


Click it and Unblock the Notifications