SpiceJet employees: భారత విమానయాన రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇటీవల దేశీయ ఎయిర్‌లైన్స్ కంపెనీలు పెట్టిన ఫ్లైట్ ఆర్డర్స్ చూసి ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. భారతీయ ఏవియేషన్ స్థాయిని గుర్తించాయి. అయితే ఇదే సమయంలో పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం ఈ రంగాన్ని కలవరపెడుతోంది.
గత ఆరేళ్లుగా ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్-సీజన్ కారణంగా 150 మంది క్యాబిన్ సిబ్బందికి 3 నెలల పాటు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. జీతాలు చెల్లించడంలో సవాళ్లను ఎదుర్కొంటూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్‌లు, ఇంజిన్ లీజర్‌లు, రుణదాతలు మరియు మాజీ ప్రమోటర్ కళానిధి మారన్‌తోనూ కంపెనీ చట్టపరమైన వివాదాలను ఎదుర్కొంటోంది. దీంతో ఈ చర్య కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని స్పైస్‌జెట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులను పూర్తిగా తొలగించడం లేదని, ఈ 3 నెలల వ్యవధిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్జిత సెలవులు కూడా పొందుతారని సంస్థ స్పష్టం చేసింది.
ప్రస్తుతం దాదాపు 22 విమానాలతో స్పైస్‌జెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఆగస్ట్ 2024లో నిర్వహించిన ప్రత్యేక ఆడిట్ తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కంపెనీపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. దీంతో నియంత్రణ సంస్థ తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ చర్య ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నా, వారి భద్రత కోసం ఫ్లైట్ స్థితిని నిశితంగా పరిశీలిస్తుంది.


Click it and Unblock the Notifications