కరోనా మహమ్మారి కారణంగా మార్చి చివరి వారం నుండి వ్యాపారాలు లేవు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో జూన్ నుండి క్రమంగా కార్యకలాపాలు తెరుచుకుంటున్నాయి. సెప్టెంబర్ మాసంలో డిమాండ్ పుంజుకుంది. ఇది వ్యాపారుల్లో కాస్త ఆనందాన్ని నింపింది. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో సేల్స్ పుంజుకుంటాయని అన్ని రంగాల్లోని రిటైల్ వ్యాపారులు భావిస్తున్నారు. డిమాండ్ పెంచుకోవడానికి చాలా ఉత్పత్తులు భారీ ఆఫర్లు ప్రకటించాయి. అయితే ఈ దీపావళి సీజన్‌లో ప్రజలు గతంలో మాదిరి ఖర్చులు చేయకపోవచ్చునని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ దీపావళికి సగటు కంటే తక్కువగా ఖర్చు చేయనున్నట్లు తేలింది.

సేల్స్ అంతంతమాత్రమే..
ఈసారి దీపావళి పర్వదినం సమయంలో సేల్స్ అంతంతగానే ఉండొచ్చని మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ యూగవ్(YouGov) సర్వేలో వెల్లడైంది. తమ ఆర్థిక విషయాల్లో గతంలో కంటే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. సుమారు 50 శాతం మంది ఖర్చుల పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ మధ్య జరిగిన సర్వేలో 2,500మంది పాల్గొన్నారు. 54 శాతం మంది గత ఏడాది దీపావళి సమయం కంటే తక్కువగా కొనుగోళ్లు జరుపుతామని తెలిపారు. గత ఏడాది చేసిన సర్వేలో అంతకుముందు ఏడాది కంటే తక్కువ ఖర్చు చేస్తామన్న వారి సంఖ్య 23 శాతంగా ఉంది. గత దీపావళి సీజన్‌లో ఖర్చు చేసినంతగా చేస్తామని 20 శాతం మంది చెప్పారు. ఎక్కువ ఖర్చు చేస్తామని 17 శాతం మంది తెలిపారు.

ఆదాయం పెరిగిందన్నవారు ఎంతమంది అంటే
పది ప్రాధాన్యతాంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. స్థూల ఆదాయం, వ్యయాల్లో పెరుగుదల తగ్గుదల, దీపావళి సమయంలో వ్యయధోరణులు వంటి అంశాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 15 శాతం మంది మాత్రమే తమ ఆదాయాలు పెరిగినట్లు తెలిపారు. ఆర్థిక విషయాల్లో గతంలో కంటే జాగ్రత్తగా ఉంటున్నట్లు 50 శాతం మంది తెలిపారు.

మందగమనం.. కరోనా
గత ఏడాది ఆర్థికమందగమనం, ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారులు ఈ పండుగ సీజన్ కోసం వేచి చూస్తున్నారని, పుంజుకుంటుందని ఆశలతో ఉన్నారని, కానీ కస్టమర్ల నుండి ఆ మేరకు ఉత్సాహం కనిపించడం లేదని యూగవ్ ఇండియా జనరల్ మేనేజర్ దీపా భాటియా అన్నారు. డిమాండ్ కొన్ని కేటగిరీస్‌కు పరిమితమైందన్నారు. మందగమనం, కరోనా షాపింగ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

స్మార్ట్ ఫోన్లకు..
ఇక స్మార్ట్ ఫోన్ సహా గాడ్జెట్స్ కొనుగోలుకు 22 శాతం మంది, దుస్తుల షాపింగ్‌కు 22 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అప్లియెన్సెస్ 17 శాతం, ఫ్యాషన్ యాక్సెసరీస్ 15 శాతం, జ్యువెల్లరీ 12 శాతం ఉన్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లకు 54 శాతం ఓటు వేశారు. ఆభరణాలు, ఖరీదైన వస్తువుల కొనుగోలుకు దుకాణాలకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్ లైన్‌లో స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు 65 శాతం మంది, ఆఫ్‌లైన్ కొనుగోలుకు 18 శాతం మొగ్గు చూపారు. ఫ్యాషన్ యాక్సెసరీస్ (49 శాతం), బ్యూటీ అండ్ మేకప్ (48 శాతం), దుస్తులు (46 శాతం), అప్లియెన్సెస్ (44 శాతం) ఆన్‌లైన్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. జ్యువెల్లరీని మాత్రం 61 శాతం మంది ఆఫ్‌లైన్‌లో, 16 శాతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications