నాలుగేళ్ల తర్వాత... మార్చి 1 నుండి స్పెక్ట్రం వేలం, వొడాఫోన్ ఐడియా డౌట్
న్యూఢిల్లీ: 6వ విడత స్పెక్ట్రం వేలం ప్రక్రియ మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కానుంది. రూ.3.92 లక్షల కోట్ల విలువైన రేడియో తరంగాలకు ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు టెలికం విభాగ (DoT) విడుదల చేసిన నోటీసు ఆధారంగా తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రంను వేలం వేస్తోంది. తాజా స్పెక్ట్రం వేలం ప్రక్రియలో భాగంగా ఫ్రీబిడ్ కాన్ఫరెన్స్ తేదీని జనవరి 28వ తేదీగా DoT నిర్ణయించింది. నోటీసులో సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి జనవరి 28వ తేదీ వరకు అవకాశం కల్పించింది. వేలంలో పాల్గొనడానికి టెలికం సంస్థలు ఫిబ్రవరి 5వ తేదీ వరకు బిడ్స్ సమర్పించాలి. బిడ్ తుది జాబితాను ఫిబ్రవరి 24న ప్రకటిస్తారు.

5జీకి మినహాయింపు
మార్చి 1 నుండి స్పెక్ట్రం వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. 700MHz, 800MHz, 900MHz, 1,800MHz, 2,100MHz, 2,300MHz, 2,500MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2,251.25MHz స్పెక్ట్రంను వేలం వేసే ప్రతిపాదనకు గతడిసెంబర్ 17వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 3,300-3,400MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రాన్ని మినహాయించారు. ఈ బ్యాండ్ స్పెక్ట్రంను 5జీ టెలికం సేవలకు వినియోగిస్తారు. దేశంలో 5జీ సేవల ప్రారంభం మరింత ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. మార్చి 1 నుండి వేసే 700MHz స్పెక్ట్రంకు అధిక ధర పలుకుతుందని భావిస్తున్నారు. దేశంలో అన్ని సర్కిల్స్‌లో ఈ స్పెక్ట్రం కావాలనుకునే ఆపరేటర్లు దాదాపు రూ.33వేల కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని భావిస్తున్నారు.

ఏజీఆర్ ఛార్జీలు కూడా
వేలం దక్కించుకున్న బిడ్డర్స్ ముందస్తు చెల్లింపులను పూర్తిగా ఒకేసారి చెస్తామని ఎంపిక చేసుకుంటే బిడ్డర్స్ విజేతల వివరాలను ప్రకటించిన నాటి నుండి 10 రోజుల్లో చెల్లింపులు చేయాలి. వాయిదాలలో చెల్లిస్తామని ఎంచుకుంటే 1,800MHz, 2,100MHz, 2,300MHz, 2,500MHzలకు 50 శాతాన్ని, 700MHz, 800MHz, 900MHzలకకు 25 శాతాన్ని డాట్ నోటీసులు అందిన రోజు నుండి పది రోజుల్లో చెల్లించాలి. ఒకసారి స్పెక్ట్రం ఛార్జీలతో మిగిలిన మొత్తాన్ని రెండేళ్ళలో చెల్లించేలా మారటోరియం ఉంటుంది. వీటిని 16 వార్షిక వాయిదాల్లో డాట్ తీసుకుంటుంది. బిడ్ దక్కించుకున్నవారు స్పెక్ట్రం వినియోగ ఛార్జీ కింద ఏజీఆర్ మూడు శాతాన్ని చెల్లించాలి.

వొడాఫోన్ ఐడియా దూరం
కొన్ని సర్కిల్స్ స్పెక్ట్రం రెన్యూవల్ వేలంలో వొడాఫోన్ ఐడియా పాల్గొనకపోవచ్చునని భావిస్తున్నారు. అన్ని సర్కిల్స్‌లో కంపెనీలు రూ.60వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications