ప్రముఖ పరిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చ నెట్టింట వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా తొలుత తన ట్రక్కులపై తెలుగులో రూపొందించిన ప్రమోషనల్ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఒక్క నిర్ణయం చాలు...మీ విధి మీ చేతుల్లో ఉంది.ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి అంటూ తెలుగులోనే క్యాప్షన్ రాశారు.
దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్..తెలుగును ప్రేమించినందుకు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రకటన చాలా నచ్చింది సార్ అని అన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాల గురించి ప్రస్తావించారు. మా రాష్ట్రం పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుందని, మీరు పెట్టుబడులు పెట్టినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఆనంద్ మహీంద్రా దీనికి రిప్లై ఇస్తూ.. ఖచ్చితంగా ఏపీలో పెట్టుబడులను కొనసాగిస్తాము. మీకు ఇప్పటికే కొన్ని ఒప్పందాలు జరిగాయని సమాధానమిచ్చారు. అంతేకాక, పర్యాటక రంగంలో కూడా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్నట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఏపీతో ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని.. ముందు ఇంకా చాలా ఉందని అన్నారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. మనం కలిసి పనిచేద్దాం, మీ పెట్టుబడులను మేము గొప్పగా భావిస్తున్నాం. వాటిని మరింత పెంచాలని ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు.

ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఎరోస్పేస్ పరికరాల తయారీలో మహీంద్రా గ్రూప్ ప్రణాళికలను ఆసక్తిగా చదివి తెలుసుకున్నానని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రంగానికి భారీ ప్రోత్సాహకాలతో పాటు అనువైన విధానాలు అందిస్తుందని నారా లోకేష్ తెలిపారు. తయారీ కోసం ఏపీని మీరు పరిగణిస్తే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను కొత్త తయారీ హబ్‌గా మార్చేందుకు జరుగుతున్న ప్రభుత్వ ప్రయత్నాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత వారంలోనే నారా లోకేష్ కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ భూ సేకరణను అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో వెంటనే స్పందించిన సంగతి విదితమే. తమ వద్ద మీకు కావాల్సినంద భూమి అందుబాటులో ఉందని.. మా రాష్ట్రానికి రావాలని ఏరో కంపెనీలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై కర్ణాటక పరిశ్రమల మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది. తాము భూసేకరణను క్యాన్సిల్ చేశాం కానీ ఏరో స్పేస్ పార్క్ ని కాదన్నారు. తమ వద్ద మంచి ఎకోసిస్టం ఉందని కర్ణాటక మంత్రి బదులిచ్చారు. కాగా మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా తమ తెలుగు అడ్వర్టయిజ్ మెంట్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపైనే ఈ చర్చంతా నడిచింది.


Click it and Unblock the Notifications