ప్రపంచంలోనే అతిపెద్ద IPO.. మార్కెట్లోకి ఎలోన్ మస్క్ ‘స్పేస్‌ఎక్స్'.. డేట్ ఫిక్స్, వివరాలు ఇవే!
గ్లోబల్ స్టాక్ మార్కెట్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) తన మోస్ట్ అవేటెడ్ IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) తో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఈ బిగ్గెస్ట్ ఐపీఓకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు (Institutional Investors) ఏకంగా $10 బిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షేర్ల కోసం ఆర్డర్లు పెట్టేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
2019లో సౌదీ అరామ్‌కో సృష్టించిన $29.4 బిలియన్ల బిగ్గెస్ట్ ఐపీఓ రికార్డును బద్దలు కొడుతూ.. స్పేస్‌ఎక్స్ చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్‌తో స్టాక్ మార్కెట్లలో రికార్డు సృష్టించబోతోంది.

స్పేస్‌ఎక్స్ ఐపీఓ లిస్టింగ్ డేట్ ఎప్పుడు?
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, ఈ IPO కి సంబంధించిన షేర్ల ధరల ఖరారు (Pricing) జూన్ 11న జరగనుంది. ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం, జూన్ 12, 2026 నుండి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో ఈ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం 555.6 మిలియన్ షేర్లను విక్రయానికి ఉంచింది. ఒక్కో షేరు ధరను $135 (ఫిక్స్‌డ్ ప్రైస్) గా నిర్ణయించారు. ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా $75 బిలియన్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో కంపెనీ మొత్తం వాల్యుయేషన్ $1.8 ట్రిలియన్లకు చేరుకుంటుంది.
రీటైల్ ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!
ఈ మెగా ఐపీఓలో సాధారణ రీటైల్ ఇన్వెస్టర్ల (మనలాంటి చిన్న ఇన్వెస్టర్ల) కోసం కంపెనీ ఏకంగా 30 శాతం షేర్లను కేటాయించింది. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో రీటైల్ ఇన్వెస్టర్లు బుధవారం లోపే తమ ఆర్డర్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరోపక్క, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కూడా బుధవారం సాయంత్రంతోనే గడువు ముగియనుంది. ఈ ఐపీఓ కోసం మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ తన న్యూయార్క్ హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు 300 మంది బిగ్ ఇన్వెస్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్, సీఎఫ్ఓ బ్రెట్ జాన్సన్ ఇన్వెస్టర్ల సందేహాలను నివృత్తి చేశారు.
గూగుల్‌తో భారీ డీల్.. అదరగొడుతున్న కొత్త ఆదాయ మార్గాలు!
కేవలం రాకెట్ లాంచ్‌లు మాత్రమే కాకుండా, శాటిలైట్ ( స్టార్‌లింక్), స్పేస్ రీసెర్చ్, ఏఐ (AI), , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (గతంలో ట్విట్టర్) నిర్వహణ వంటి పలు రంగాలలో స్పేస్‌ఎక్స్ దూసుకుపోతోంది. తాజాగా ఈ కంపెనీ గూగుల్ మాతృసంస్థ 'Alphabet' తో ఒక భారీ క్లౌడ్ సర్వీసెస్ డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం 2029 వరకు ఆల్ఫాబెట్ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు నెలకు $920 మిలియన్లు చెల్లించనుంది. అలాగే ప్రముఖ ఏఐ కంపెనీ 'Anthropic' తో కూడా స్పేస్‌ఎక్స్ ఒప్పందం చేసుకుంది. మార్కెట్లో దీనికి ఆంత్రోపిక్‌తో పాటు $850 బిలియన్ల వాల్యుయేషన్ ఉన్న ఓపెన్ ఏఐ (OpenAI) నుండి గట్టి పోటీ ఎదురవుతోంది.
అద్భుతమైన గ్రోత్.. కానీ ఆ నష్టాలే టెన్షన్!
కంపెనీ వృద్ధి రేటు అద్భుతంగా ఉన్నప్పటికీ, దాని ఆర్థిక నష్టాలు మాత్రం ఇన్వెస్టర్లను కొంచెం ఆలోచనలో పడేస్తున్నాయి. 2025లో స్పేస్‌ఎక్స్ రెవెన్యూ 33% పెరిగి $18.6 బిలియన్లకు చేరినప్పటికీ.. ఆ ఏడాది ఆపరేటింగ్ లాస్ (నిర్వహణ నష్టం) $4.9 బిలియన్లుగా నమోదైంది. అంతేకాకుండా, 2026 మొదటి త్రైమాసికంలో (Q1) కంపెనీ రెవెన్యూ తగ్గడమే కాకుండా, ఆపరేటింగ్ లాస్ $1.9 బిలియన్లకు పెరిగింది. కంపెనీ క్యాష్ రిజర్వ్స్ తగ్గడం, అలాగే $60 బిలియన్లకు పైగా దీర్ఘకాలిక అప్పులు ఉండటం గమనార్హం.
ఏదేమైనా, అంతరిక్ష రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న ఎలోన్ మస్క్ కంపెనీ మార్కెట్లోకి వస్తుండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ IPO పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ హిస్టారికల్ ఐపీఓ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!


Click it and Unblock the Notifications