రాకెట్ వేగంతో దూసుకొచ్చి కుప్పకూలిన ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) షేర్లు అమెరికన్ స్టాక్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు కూడా భారీ పతనాన్ని చవిచూశాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లోనే ఈ కంపెనీ షేర్లు ఏకంగా 16 శాతం మేర కుప్పకూలాయి. ఈ వరుస క్షీణత కారణంగా కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే కంపెనీ తన మార్కెట్ విలువలో సుమారు 600 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోవడం గమనార్హం.
సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి స్పేస్‌ఎక్స్ షేరు ధర $154.60 వద్ద స్థిరపడింది. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పటి నుండి ఇదే అత్యంత కనిష్ట స్థాయి అయినప్పటికీ, ప్రస్తుత ధర దాని ఐపిఓ (IPO) ప్రారంభ ధర అయిన $135 కంటే ఇంకా 15 శాతం అధికంగానే ట్రేడ్ అవుతోంది.కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పడిపోవడానికి స్పేస్‌ఎక్స్ తాజాగా ప్రకటించిన కొత్త నిధుల సమీకరణ ప్రణాళికలే ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్ సంస్థ తన చరిత్రలోనే తొలిసారిగా ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ బాండ్లను జారీ చేయడానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఈ బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్ నుండి కనీసం 20 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. కృత్రిమ మేధ (AI) రంగానికి సంబంధించిన తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికే ఈ నిధులను ప్రధానంగా వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో స్పేస్‌ఎక్స్ అంతరిక్ష పరిశోధనలతో పాటు ఏఐ వ్యాపారంపై విపరీతంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్‌ఏఐ' (xAI) కంపెనీని కొనుగోలు చేసిన ఈ సంస్థ.. తాజాగా సోమవారం 'రిఫ్లెక్షన్ ఏఐ' అనే సరికొత్త స్టార్టప్‌తో బహుళ-బిలియన్ డాలర్ల కంప్యూటింగ్ వనరుల ఒప్పందాన్ని కూడా ప్రకటించింది.
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన స్పేస్‌ఎక్స్ యొక్క 75 బిలియన్ డాలర్ల ఐపీఓ, గ్లోబల్ మార్కెట్లో అతిపెద్ద ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. అయితే ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య పరిమితంగా ఉండటం, అదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో దీనిపై విపరీతమైన క్రేజ్ ఉండటంతో లిస్టింగ్ అయిన తొలి రోజుల్లో ఈ స్టాక్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది.
కేవలం మొదటి ఐదు రోజుల్లోనే రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా $405 మిలియన్ల నికర కొనుగోళ్లు జరిపారు. గత వారం రోజుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు అమెరికాలోని టాప్-7 టెక్ దిగ్గజాలలో పెట్టిన మొత్తం పెట్టుబడి కంటే కేవలం స్పేస్‌ఎక్స్ షేర్లలోనే ఎక్కువ నిధులను కుమ్మరించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుత పతనం నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'కీబ్యాంక్ క్యాపిటల్ మార్కెట్స్' ఈ స్టాక్‌కు 'సెక్టార్ వెయిట్' (హోల్డ్) రేటింగ్‌ను ఇస్తూ తన మొదటి నివేదికను ఇచ్చింది. అంతరిక్ష ప్రయోగాలలో స్పేస్‌ఎక్స్ తిరుగులేని లీడర్ అయినప్పటికీ, దాని దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు ఇప్పటికే స్టాక్ ధరలో కలిసిపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ భారీ క్షీణత తర్వాత కూడా స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్ల పైన స్థిరంగా కొనసాగుతూ ప్రపంచంలోని టాప్-6 అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. అయితే ఏఐ రంగంలో కంపెనీ పెడుతున్న ఈ భారీ పెట్టుబడులు భవిష్యత్తులో ఎలాంటి రాబడులను ఇస్తాయనే అంశంపైనే ఈ స్టాక్ తదుపరి గమనం ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications
