Rice News: కొన్ని నెలలుగా దేశంలోని సంక్లిష్ట వాతావరణం కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో పప్పులు, కూరగాయల ధరలతో పాటు బియ్యం ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. దీంతో కేంద్రం ముందస్తుగా ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరను అదుపు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ధరలను కనిష్ట స్థాయికి తగ్గించాలని ప్రభుత్వం బియ్యం పరిశ్రమల సంఘాలను ఆదేశించింది. బియ్యం ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన ముఖ్య ప్రతినిధులతో ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశం నిర్వహించి ధరలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత రెండేళ్లలో బియ్యం ధరలు ఏకంగా 12 శాతం పెరిగాయి.

మంచి పంట దిగుబడి, ఎగుమతి నిషేధం ఉన్నప్పటికీ బియ్యం ధరలు పెరగడానికి గల కారణాన్ని కూడా చర్చించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమకు నాణ్యమైన బియ్యం తగినంత స్టాక్ ఉందని తెలియజేసింది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(OMSS) పద్ధతిలో కేజీ బియ్యం ధరను రూ.29కి విక్రయిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద, వ్యాపారులు ఎఫ్‌సిఐ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు. జూలై మాసంలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ఆసియా, ఆఫ్రికాలోని వ్యూహాత్మక భాగస్వాములకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది
ఇటీవలి నెలల్లో సింగపూర్, నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్‌తో సహా 14 ప్రధాన ఆసియా, ఆఫ్రికన్ దేశాలకు 2.77 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదిలా ఉండగా పప్పు దినుసుల లభ్యత మెరుగుపడడంతో పాటు వాటికి మార్కెట్లో డిమాండ్ తగ్గటం వల్ల వీటి ధరలు ఫిబ్రవరి నాటికి 18 శాతానికిపైగా తగ్గుతాయని అంచనా వేయబడింది. వాస్తవానికి గత ఏడాది ఉత్పత్తి తగ్గటం పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది.


Click it and Unblock the Notifications