UPI Credit Line: దేశంలో యూపీఐ చెల్లింపుల విధానం ఎంత వేగంగా వృద్ధి చెందిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉంటేనే యూపీఐ చెల్లింపులు చేసేందుకు వీలు ఉండేది. అయితే త్వరలో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయటానికి అవకాశం రాబోతోంది.
రానున్న రోజుల్లో యూజర్లు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా సులభంగా UPI చెల్లింపులు చేయగలుగుతారు. యూపీఐ ఉపయోగించే కస్టమర్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది. వాస్తవానికి యూపీఐపై క్రెడిట్ లైన్ 9 నెలల క్రితమే ప్రకటించబడింది. ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత వినియోగదారుల యూపీఐ ఖాతా క్రెడిట్ కార్డ్ లాగా పని చేస్తుంది. వాస్తవానికి యూపీఐపై క్రెడిట్ లైన్ అనేది బ్యాంక్ ఖాతాను ఉపయోగించే కస్టమర్‌కు ముందస్తుగా ఆమోదించబడిన రుణం.

ప్రతి కస్టమర్ తన సిబిల్ స్కోర్ ప్రకారం క్రెడిట్ లైన్ పొందుతారని కార్పొరేషన్ చెబుతోంది. దీని ద్వారా బిజినెస్ ఖాతాలకు మాత్రమే చెల్లింపులు చేయటం కుదురుతుంది. అయితే ఈ క్రెడిట్ లైన్ వినియోగించుకున్నందుకు బ్యాంకులు నిర్థిష్ట వడ్డీని వసూలు చేస్తాయి. ఈ విషయమై ఇప్పటికే పలు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో కార్పొరేషన్ చర్చలు జరిపింది. ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ చేరడానికి అంగీకరించాయి.
ఈ సౌకర్యం వినియోగదారులకే కాకుండా దుకాణదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2000 కంటే ఎక్కువ చెల్లింపు చేస్తే దుకాణదారులు దాదాపు రెండు శాతం ఛార్జీని చెల్లించాలి. UPIలో క్రెడిట్ లైన్ పొందిన తర్వాత అటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. క్రెడిట్ కార్డ్ ద్వారా రూపే కార్డ్ యూజర్లు తమ బిల్లింగ్ సైకిల్ కాలంలో చేసే చెల్లింపులకు ఎలాంటి వడ్డీని చెల్లించక్కర్లేదని మనందరికీ తెలిసిందే. అయితే యూపీఐ క్రెడిట్ లైన్‌లో మీరు ఉపయోగించిన మొత్తంపై వడ్డీని చెల్లించాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాగా పనిచేస్తుంది.
ప్రతి లావాదేవీపై క్రెడిట్ జారీచేసేవారికి వ్యాపారి చెల్లించే కమీషన్ ఇంటర్‌చేంజ్. లావాదేవీని మరింత సౌకర్యవంతంగా చేయడానికి వ్యాపారులు బ్యాంకులకు ఈ రుసుమును చెల్లిస్తారు. UPI క్రెడిట్ లైన్ కోసం కార్పొరేషన్ త్వరలో 1.2 శాతం ఇంటర్‌చేంజ్‌ను ప్రకటించాలని చూస్తోందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలో సర్క్యులర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదాయాల్లో వాటా కోసం యాప్‌లు, బ్యాంకులతో ఇప్పటికే ఎన్పీసీఐ చర్చలు జరుపుతోంది. అయితే ఈ ఛార్జీల ప్రభావం సామాన్య యూపీఐ వినియోగదారులపై ఉండదని తెలుస్తోంది.
QR కోడ్ ఆధారిత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ చెల్లింపు సేవను ఖతార్‌లో ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా QNBతో జతకట్టింది. యూపీఐ చెల్లింపులను ప్రారంభించేందుకు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక సంస్థ అయిన QNBతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. ఈ భాగస్వామ్యం భారతీయ పర్యాటకులకు రిటైల్ దుకాణాలు, పర్యాటక ఆకర్షణలు, విశ్రాంతి గమ్యస్థానాలు, డ్యూటీ-ఫ్రీ షాపులు, హోటళ్లలో వారి ఇష్టపడే చెల్లింపు పద్ధతిని ఉపయోగించుకునే అవకాశాన్ని అందించనుంది.


Click it and Unblock the Notifications