EMI Penalty: రిజర్వు బ్యాంకు వరుసగా 6 సార్లుగా వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై వడ్డీని పెంచుతున్నాయి. దీంతో చాలా మందికి లోన్ EMI చెల్లింపులు గతంలో కంటే భారంగా మారటంతో సమయానికి వాటికి చెల్లించటంలో మిస్ అవుతున్నారు.

బ్యాంకుల పెనాల్టీలు..
సమయానికి రుణ చెల్లింపులు చేయని వారిపై బ్యాంకులు 1-2 శాతం లేటు చెల్లింపు రుసుము వేస్తుంటాయి. అయితే దీని నుంచి త్వరలోనే రుణాలు తీసుకున్నవారికి పెద్ద ఊరట లభించనుంది. ఇలాంటి జరిమానాల గురించి బ్యాంకులు విడివిడిగా వివరాలు ఇవ్వాలని RBI తెలిపింది. వాయిదా చెల్లింపులో జాప్యం కోసం విధించే జరిమానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.. అందుకే రిజర్వు బ్యాంక్ సమాచారం సేకరిస్తోంది.

రిజర్వు బ్యాంక్..
ఫిబ్రవరి MPC మీటింగ్ తర్వాత దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాన్ని విడుదల చేస్తామని ఆర్‌బిఐ తెలిపింది. ఈ విషయంలో అన్ని వాటాదారుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం ఆలస్యంగా రుణాలను చెల్లించటం వల్ల బ్యాంకులు వసూలు చేస్తున్న జరిమానాను తొలగించాలని రిజర్వు బ్యాంక్ ప్రయత్నిస్తోంది. పైగా జరిమానాను బ్యాంకులు లోన్ మెుత్తానికి కలుపుతుంటాయి. అందువల్ల ఎంత పెనాల్టీ పడిందో తెలుసుకోవటం కష్టతరంగా మారుతోంది. రుణ పరిమాణం, రకాన్ని బట్టి పెనాల్టీ మెుత్తం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ స్కోర్..
ఉదారహణకు మీరు నెలకు చెల్లించాల్సిన వాయిదా రూ.25,000 ఉందనుకుందాం. దీనిపై నెలకు రెండు శాతం వడ్డీ బ్యాంక్ పెనాల్టీగా వసూలు చేస్తున్నట్లయితే అది రూ.500 అవుతుంది. అయితే ఇకపై బ్యాంకులు ప్రత్యేకంగా పెనాల్టీని నిర్ణయించాల్సి ఉంటుంది. లోన్ తీసుకునే వ్యక్తులు చెల్లింపుల్లో ఆలస్యం చేయటం వల్ల వారి CIBIL స్కోర్ ప్రభావితం అవుతుంది. అనేక మార్లు లోన్ చెల్లింపులు ఆలస్యం చేయటం వల్ల క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది.

బ్యాంకులు ఏం చేస్తాయి..?
సాధారణంగా బ్యాంకు లోన్ తీసుకున్నవారికి 60 రోజుల నోటీసును పంపుతుంది. ఈ వ్యవధిలో చెల్లింపు చేయలేకపోతే దానిని బ్యాంకులు NPAగా వర్గీకరిస్తాయి. ఆ తర్వాత రుణాలు చెల్లించనివారి వద్దకు రికవరీ ఏజెంట్లను పంపుతుంటాయి. పరిస్థితి ఇంతవరకు చేరకుండా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. మీరు దీని గురించి బ్యాంకును సంప్రదించవచ్చు. బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మారటోరియం ఇవ్వవచ్చు. అందుకే ఎల్లప్పుడూ ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications