Banking News: రానున్న కాలంలో బ్యాంక్ ఉద్యోగులు సైతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లాగా శనివారం, ఆదివారం సెలవులను పొందనున్నారు. గతంలో మాదిరిగా రెండు, నాలుగవ శనివారాలు మాత్రమే కాకుండా అన్ని శనివారాలు బ్యాంకులు మూసివేయబడనున్నాయి.
దీనికి సంబంధించిన ప్రతిపాదనను సమర్పించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. ఇందులో దేశంలోని అన్ని బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. అంటే రానున్న కాలంలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలనే డిమాండ్ ఐబీఏ సమర్పించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.

2015లో భారతదేశంలోని అన్ని బ్యాంకులకు నెలలో రెండు శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతోపాటు కొత్త నిబంధనను అమలు చేసింది. అప్పటి నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శనివారం శెలవుగా కొనసాగిస్తున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ బ్యాంకులకే కాక.. ప్రైవేటు బ్యాంకులకు సైతం వర్తింపజేసింది. వాస్తవానికి వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉండాలనే డిమాండ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగుల నుంచి చాలా కాలంగా ఉంది. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరూ వారానికి రెండు సెలవులను డిమాండ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించి గతంలో వచ్చిన నివేదికల్లో వారానికి రెండు రోజుల సెలవు గిఫ్ట్ లభించిన తర్వాత బ్యాంకు ఉద్యోగుల పనివేళలు పెరిగే అవకాశం ఉందని.. పెంచవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తే.. ఉద్యోగులు ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. అంటే వారి పని సమయం ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉండవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications