Tesla Factory: అమెరికా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఇంక్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకోనుందని తెలుస్తోంది. ఎప్పటి నుంచే అతిపెద్ద ఆటో మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్ లోకి అరంగేట్రం చేసేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వచ్చే ఏడాది నుంచి దేశంలోకి ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడానికి, రెండేళ్ల వ్యవధిలో తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి టెస్లాకు ఇండియా అనుమతిస్తుందని ఒక రహస్య నివేదికను బ్లూమ్‌బెర్గ్ ఉదహరించింది. దీనిపై 2024 జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

టెస్లా భారతదేశంలో కొత్త ప్లాంట్‌లో ప్రారంభంలో సుమారు 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోందని నివేదిక పేర్కొంది. అలాగే ఇండియా నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని కూడా ప్లాన్ జరుగుతోంది. అలాగే ఖర్చులను తగ్గించుకోవడానికి కొన్ని బ్యాటరీలను భారత్‌లో తయారు చేయాలని కంపెనీ పరిశీలిస్తోంది. దీనిపై జూన్ లో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా భారతదేశంలో భారీగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు.
ప్రస్తుతం విద్యుత్ కార్లు ఖరీదైనవిగా మారటం వల్ల గతఏడాది వీటి విక్రయాలు కేవలం 1.3 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లపై అధిక సుంకాలను కేంద్రం విధిస్తున్న తరుణంలో టెస్లా ప్రస్తుతం ఇండియాలో తన కార్లను విక్రయించేందుకు దిగుమతి చేయటం లేదు. త్వరలోనే భారత ప్రభుత్వంతో దీనిపై చర్చలు జరిపేందుకు తాను కలుస్తానని మస్క్ పీయూష్ గోయల్ రాకపై స్పందిస్తూ వెల్లడించారు. ఈ క్రమంలో టెస్లా కర్మాగారంలో భారతదేశానికి చెందిన పరిశోధకులు, ఇంజనీర్లను గోయల్ కలిశారు.


Click it and Unblock the Notifications