Solar AC: సోలార్ ఏసీతో విద్యుత్ బిల్లులకు చెక్.. ఒక్కసారి ఇన్ స్టాల్ చేస్తే పాతికేళ్ల వరకు నో ఫికర్
Solar AC: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు, చమటలు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోవడం సాధారణం. అందుకే అనేక ఖర్చులున్నా, వాటిని పక్కకు పెట్టి ముందు ఓ AC కొనుక్కోవాలని భావిస్తుంటారు. అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినా, కరెంటు బిల్లు తలుచుకుంటే గుండె గుభేలు మనడం ఖాయం. సరిగ్గా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే సోలార్ AC రూపొందించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది దేశంలో ఎండలు విపరీతంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. దీని నుంచి బయటపడేందుకు ACల వినియోగం విపరీతంగా ఉండనుంది. తద్వారా విద్యుత్ బిల్లులు తలకు మించిన భారం కానున్నాయి. సోలార్ ACని ఈ సమస్యకు పరిష్కారంగా చెప్పవచ్చు. 0.8 టన్ను, 1 టన్ను మరియు 1.5 టన్ను, 2 టన్నుల వరకు విండ్ మరియు స్ప్లిట్ సోలార్ ACలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్రతిరోజూ 14 నుంచి 15 గంటల పాటు ఎలక్ట్రిక్ ఏసీని ఉపయోగిస్తే, రోజువారీ విద్యుత్ వాడకం దాదాపు 20 యూనిట్లు ఉంటుంది. అంటే ఒక నెలలో సుమారు 600 యూనిట్లు ఖర్చు అవుతుంది. విద్యుత్ ఛార్జీలు యూనిట్‌కు రూ.8గా లెక్కిస్తే, నెలవారీ ఖర్చు 4,800 అవుతుంది. కానీ సోలార్ ఏసీకి విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే దీనిని ఇన్ స్టాల్ చేసుకుంటే ప్రతి నెల 5 వేల వరకు ఆదా అవుతుంది.
సోలార్ ఏసీకి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే కావడం మరో ప్లస్ పాయింట్. మరోపక్క పర్యావరణానికి సైతం మేలు చేసిన వారవుతాం. అయితే ఈ తరహా ఏసీల విషయానికి వస్తే, సోలార్ ప్యానెల్స్ మరియు బ్యాటరీ రీప్లేస్ మెంట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తే 5-25 సంవత్సరాల పాటు తిరిగి చూసే అవసరం ఉండదు. ఇన్ని లాభాలు ఉండటంతో, ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 1 టన్ను సోలార్ ఏసీ ధర లక్ష వరకు ఉండగా.. 1.5 టన్ను కోసం 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications