IT News: నిన్న మొన్నటి వరకు వేలకు వేలు హైక్ కావాలని కోరిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇప్పుడు మెల్లగా సాధారణ స్థితికి వస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో సహా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాయి. 2021తో పోలిస్తే గతేడాది డిసెంబరు నాటికి జీతాల పెంపుదలపై ఉద్యోగుల అంచనాలు 40 శాతం తగ్గాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించడానికి అధిక వేతనాలను వెచ్చించడానికి సైతం గతంలో పలు కంపెనీలు వెనకాడలేదు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అట్రిషన్ రేటు తగ్గడం వరం:
గతేడాది ఆరంభంతో పోలిస్తే డిసెంబరు నాటికి ఉద్యోగుల అట్రిషన్ రేటు దాదాపు 5-10 శాతం తగ్గడం టెక్ సంస్థలకు వరంగా మారింది. తద్వారా కొత్తగా ఉద్యోగులను తీసుకునేందుకు, రిటెన్షన్, కాంట్రాక్టర్ ఖర్చులు చాలా వరకు ఆదా చేసే అవకాశం ఏర్పడింది. తమ ఆపరేటింగ్ మార్జిన్‌లు పెంచుకోవడానికీ ఇది ఎంతగానో ఉపయోగపడినట్లు టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ పేర్కొన్నారు.

సగానికిపైగా తగ్గిన డిమాండ్:
వేతనాల పెంపు ఆశిస్తున్న ఉద్యోగుల్లోనూ భారీ మార్పులు కనిపిస్తున్నాయని అడెక్కో ఇండియా డైరెక్టర్ రమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 3-7 ఏళ్లు అనుభవమున్న అభ్యర్థులు ఉద్యోగం మారేందుకు గతంలో దాదాపు 70 శాతం వరకు జీతం పెంపు కోసం పట్టుబట్టేవారు. కానీ ఇప్పుడు ఐటీలో సర్వసాధారణమైన 30 శాతానికీ అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రమోషన్లు పనిచేశాయి:
పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలైనప్పటి నుంచి వేతనాల పెంపు విషయంలో అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలకు డిమాండ్ పెరగడం, పలు కంపెనీల లేఆఫ్‌లు వెరసి డిమాండ్ తగ్గింది. ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు కొత్త వారిని తీసుకోవడానికి బదులుగా ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడమూ అట్రిషన్ రేటు తగ్గడానికి ముఖ్య కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications