ShareChat Layoffs: ఒకపక్క ఫండింగ్ సమస్యలతో పాటు మరోపక్క వ్యాపారాలు అనుకున్నంత స్థాయిలో వృద్ధిని సాధించకపోవటంతో స్టార్టప్ ఎకోసిష్టం దెబ్బతింటోంది. దీంతో వరుసగా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.
తాజాగా సోషల్ మీడియా స్టార్టప్ యూనీకార్న్ దిగ్గజం షేర్ చాట్ సైతం ఇదే దారిని ఎంచుకుంది. కంపెనీ తమ మెుత్తం ఉద్యోగుల్లో 15 శాతం మంది అంటే దాదాపు 200 మందిని తొలగించింది. ఇదే క్రమంలో 2023 సంవత్సరంలో కంపెనీ వాల్యుయేషన్ సైతం 1.5 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.28,300 కోట్లు క్షీణించినట్లు వెల్లడైంది. తాజా లేఆఫ్స్ కారణంగా చాలా మంది ఉద్యోగులు పింక్ స్లిప్స్ అందుకోవాల్సి వచ్చింది.

కంపెనీ తన ఖర్చులను క్రమబద్దీకరించుకుని రానున్న 4-6 త్రైమాసికాల్లో వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చాలనే ఆలోచనలో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గూగుల్, టెమాసెక్ సపోర్ట్ ఉన్న షేర్ చాట్ సంస్థ కొత్తగా 50 మిలియన్ డాలర్లు ఫండింగ్ పొందేందుకు చివరి దశలో ఉన్నట్లు వెల్లడైంది. దాదాపు 8 ఏళ్ల కిందట ప్రారంభమైన కంపెనీ ఇప్పటి వరకు మెుత్తంగా 1.4 బిలియన్ డాలర్ల మేర మూలధనాన్ని వివిధ సందర్భాల్లో పెట్టుబడిదారుల నుంచి సమీకరించింది.
ఏడాది మెుదట్లో జనవరి మాసంలో షేర్‌చాట్ 20 శాతం అంటే 500 మంది ఉద్యోగులను తొలగించింది. దీని తర్వాత అదే నెలలో షేర్‌చాట్ సహ వ్యవస్థాపకులు భాను ప్రతాప్ సింగ్, ఫరీద్ అహ్సన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పాత్రల నుంచి తప్పుకున్నారు. షేర్‌చాట్ పెట్టుబడిదారుల్లో టైగర్ గ్లోబల్, స్నాప్, ట్విట్టర్, లైట్‌స్పీడ్, ఎలివేషన్ క్యాపిటల్‌తో పాటుగా పవన్ ముంజాల్, అజయ్ శ్రీధర్ శ్రీరామ్ వంటి పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. కంపెనీ విలువ 2021లో ఒక బిలియన్ డాలర్ల మార్కును అందుకోవటంతో యూనికార్న్ హోదాను దక్కించుకుంది.
కంపెనీ కొత్తగా ఫాంటసీ స్పోర్ట్స్ యాప్, లైవ్ ఆడియో చాట్ సర్వీస్ కార్యక్రమాలను ఆలస్యంగా ప్రారంభించినప్పటి నుంచి లాభదాయకతను కొనసాగించడానికి కష్టపడుతోంది. అయితే మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 65 మిలియన్ డాలర్ల కంటే తక్కువగానే నమోదైంది. ప్రస్తుత తొలగింపుల తర్వాత కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,500కి చేరుకుంది.


Click it and Unblock the Notifications