Amazon News: నెట్టింట మారుమోగుతున్న మెకెంజీ స్కాట్.. ఎవరామె? ఏంటా కథ..
Jeff Bezos News: ప్రముఖ అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ విడాకుల వ్యవహారం గతంలో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. భారీ ఖర్చుతో కూడిన విడాకులుగా కూడా ఇది రికార్డు నెలకొల్పింది. ఆయన మాజీ భార్య మెకెంజీ స్కాట్ కోట్లాది రూపాయలను సొంతం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో పలు కామెంట్స్ వినిపించాయి.
ఇప్పుడు సోషల్ మీడియాలో అదే మెకెంజీ స్కాట్ పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే భర్త నుంచి వేరైన సమయంలో పొందిన మొత్తంలో కొంత భాగాన్ని పలు సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. బర్తింగ్ బ్యూటిఫుల్ కమ్యూనిటీస్ అనే నల్ల జాతీయులకు సంబంధించిన తల్లి, పిల్లల కుటుంబాల కోసం అంకితమైన ప్రోగ్రాంకి 2 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. దీంతో ఆమె దాతృత్వంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'మెకెంజీ స్కాట్ విరాళానికి చాలా కృతజ్ఞతలు. ఈ ఉదారమైన సహకారం మా సంస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తల్లీబిడ్డలతో పాటు వారి కుటుంబాలకు తగిన సంరక్షణ మద్దతు అందించేలా మాకు సహాయపడుతుంది. ఈ నిధులతో ఈశాన్య ఒహియోలో మాతృమూర్తుల ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరుస్తాము. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును అందజేస్తాము' అని బర్తింగ్ బ్యూటిఫుల్ కమ్యూనిటీస్ ప్రెసిడెంట్ అండ్ CEO జాజ్మిన్ లాంగ్ పేర్కొన్నారు.
మొదటి ఏడాదిలోపున్న మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కోసం ఈ సంస్థ పాటుపడుతుంది. కాగా మెకెంజీ స్కాట్ దీనితోపాటు పలు సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చారు. జెఫ్ బెజోస్ నుంచి విడాకుల అనంతరం 38 బిలియన్ డాలర్ల భారీ సెటిల్‌మెంట్‌ను పొందారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళగా రికార్డులకెక్కారు. విద్య, కళలు, ప్రజారోగ్యం సహా పలు కేటగిరిల్లో లాభాపేక్షలేని 360 సమూహాలకు 1 నుంచి 2 మిలియన్ డాలర్ల మేరకు సాయం అందించారు. ఈ దాతృత్వ కార్యకలాపాల కోసం దాదాపు 650 మిలియన్ డాలర్లను ఆమె వెచ్చించారు.


Click it and Unblock the Notifications