ఏపీలో సోషల్ మీడియా బ్యాన్! షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!
ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందే అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. అయితే దీన్ని నివారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాపై బ్యాన్ విధించనుంది. పదహారేళ్ల వయసు లోపు ఉన్న వారు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త చట్టం తీసుకురానుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమీక్ష
ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం (GoM) ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ కమిటీలో హోం మంత్రి వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ వంటి కీలక నేతలు సభ్యులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలులో ఉన్న సోషల్ మీడియా నిబంధనలను అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. ఆస్ట్రేలియా దేశం ఇటీవల 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఏపీలోనూ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
నిషేధం ఎందుకు? ప్రభుత్వ వాదన ఇదే..
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై అధికారులు కొన్ని కీలక అంశాలను చర్చకు సిద్ధం చేశారు. అందులో ముఖ్యమైనవి..
- ఏకాగ్రత పెంచడం: సోషల్ మీడియాకు దూరంగా ఉంటే పిల్లల్లో అటెన్షన్ స్పాన్ (ఏకాగ్రత) పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
- భౌతిక సంబంధాలు: వర్చువల్ ప్రపంచంలో కాకుండా, తోటి పిల్లలతో ప్రత్యక్షంగా ఆడుకోవడం, మాట్లాడుకోవడం వల్ల వారి మానసిక వికాసం బాగుంటుంది.
- సైబర్ బుల్లీయింగ్: ఆన్‌లైన్ వేధింపులు, వ్యసనంగా మారే అల్గారిథమ్‌ల నుండి మైనర్లను రక్షించడం ఈ సోషల్ మీడియా బ్యాన్ (social media ban) ప్రధాన ఉద్దేశం.
- డిజిటల్ క్లిఫ్ (Digital Cliff): అకస్మాత్తుగా 16 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలోకి ప్రవేశించినప్పుడు కలిగే ఎమోషనల్ ప్రభావాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.
సోషల్ మీడియా కంట్రోల్ సెల్ ఏర్పాటు
కేవలం నిషేధమే కాకుండా.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫోటోల సర్క్యులేషన్‌ను అడ్డుకోవడానికి 'స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేషన్ సెల్'ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా వేగంగా ఫిర్యాదులను స్వీకరించడం, అభ్యంతరకర పోస్టులను తొలగించడం సులభమవుతుంది. అలాగే ఒక ప్రత్యేక నోడల్ ఆఫీసర్ ను నియమించి, కేంద్ర ప్రభుత్వం ద్వారా అవాంఛనీయ ఖాతాలను బ్లాక్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఏదేమైనా భారతదేశంలోనే ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం గురించి ఆలోచిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. గోవా కూడా ఇప్పుడు ఇదే బాటలో నడిచేందుకు ఆసక్తి చూపుతోంది. అయితే సోషల్ మీడియా బ్యాన్ ఎలా అమలు చేస్తారు అనే దానిపై భిన్న అభిప్రాయాలున్నాయి. సోషల్ మీడియా యూజర్స్ ని వయసు పరంగా గుర్తించి ఆయా అకౌంట్స్ ని బ్యాన్ చేస్తారా? లేదా ఏదైనా కొత్త మోడల్ ని తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications