NINL: మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేసింది. పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా ముందుకే సాగింది. ఈ విధానంలో సర్కారు చేతి నుంచి బయటకు వచ్చిన మొదటి సంస్థ ఒడిశాకు చెందిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(NINL). దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ చేతిలోకి వచ్చిన తర్వాత NINLకు మంచి రోజులు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కంపెనీ ఆవరణలో పాములు, తేళ్లు తిరిగేవని సంస్థ MD & CEO సుధీర్ కుమార్ మెహతా గుర్తుచేసుకున్నారు. స్థలమంతా పొదలతో నిండి, యంత్రాలు తుప్పుపట్టినట్లు చెప్పారు. పలు సవాళ్లను ఎదుర్కొని కేవలం 90 రోజుల్లోనే మూలన పడిన యూనిట్‌ను తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు.

అప్పుడు అప్పులతో సతమతమవుతున్న NINL ఇప్పుడు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. ఏప్రిల్-సెప్టెంబర్ లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దాదాపు 3 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడించారు. ఆగస్ట్‌లో టేక్ ఓవర్ అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులందరికీ మొత్తం జీతం చెల్లించామని స్పష్టం చేశారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 120 కి.మీ దూరంలోని కళింగనగర్‌లో NINL ఉంది. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యం కలిగిన ఈ యూనిట్.. నిధుల కొరత సహా పలు కారణాలతో మూడేళ్లపాటు మూతపడింది. టాటా గ్రూపు దీన్ని చేజిక్కించుకున్న అనంతరం జంషెడ్‌పూర్ మరియు మేరమండలిలోని టాటా స్టీల్ కు చెందిన సాంకేతిక మరియు మెకానికల్ నిపుణులు NINL బ్లాస్ట్ ఫర్నేస్‌ను అక్టోబర్ 11, 2022న పునఃప్రారంభించారు.
'నాన్‌స్టాప్‌గా పనిచేసిన మా సిబ్బంది రెండు వారాల్లోనే అక్టోబర్ 24న మొదటి బిల్లెట్‌ను విడుదల చేశారు. నిజంగా మొత్తం NINL కుటుంబం ఓ కొత్త ఉత్సాహం మరియు గర్వంతో దీపావళిని జరుపుకోవడం సంతోషం కలిగించింది. ప్లాంట్‌ను మరోసారి ఆపరేట్ చేయడం చూసి అందరి కళ్లూ భావోద్వేగాలతో చెమ్మగిల్లాయి" అని మెహతా గుర్తు చేసుకున్నారు. కాగా ప్రస్తుతం 100 శాతం పూర్తి కెపాసిటీతో ప్లాంట్ నడుస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications