IPO News: మార్కెట్ నిపుణులకే మతిపోగొట్టిన IPO.. 12 కోట్ల కోసం వస్తే వేల కోట్లు ఆఫర్..
Resourceful Automobile: స్టాక్ మార్కెట్లను అర్థం చేసుకోవడం చాలా కష్టతరం. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేముందు సంక్లిష్టమైన నియమనిబంధనలు, స్ట్రాటజీలు వంటి అనేక యాంగిల్స్ ను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలను చూస్తుంటే లాజిక్కులకు బదులు మ్యాజిక్కులే ఇన్వెస్టర్లను నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. గత కొంత కాలంగా భారతీయ మార్కెట్లలో IPOలు తెగ సందడి చేస్తూ వస్తున్నాయి. వీటికి ఇన్వెస్టర్ల మద్దతు కూడా బాగా లభిస్తుండటంతో మార్కెట్లో లిస్టు అయ్యేందుకు ఆయా సంస్థలు క్యూ కట్టాయి. ఈ కోవలో తాజాగా జరిగిన ఓ ఉదంతం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
IPOలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు గడించినవారు ఎందరో ఉన్నారు. అదేవిధంగా వాటిని నమ్మి నష్టాల్లో కూరుకుపోయిన వారూ లేకపోలేదు. తాజాగా ఆటోమొబైల్ బైక్ షోరూం సంస్థ ఒకటి IPOకు వచ్చింది. కానీ దానికి వచ్చిన స్పందన చూసి ఫైనాన్షియల్ మార్కెట్ల విశ్లేషకులకే మైండ్ బ్లాక్ అయింది. అదేమైనా ప్రముఖ కంపెనీ సబ్సిడరీనా అంటే కాదు. గతంలో మంచి లాభాలను పోస్ట్ చేసిన ట్రాక్ కూడా లేదు. కానీ 70 శాతానికి పైగా గ్రే మార్కెట్ ప్రీమియంతో పిచ్చెక్కించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్స్ అనే SME IPOగా మార్కెట్లోకి వచ్చింది. దీనికి యమహా బ్రాండ్ సహా పలు ఇతర స్కూటర్లు మరియు టూవీలర్స్ సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ లతో కూడిన రెండు షోరూమ్స్ ఉన్నాయి. వీటిలో కేవలం 8 మంది ఉద్యోగులే పనిచేస్తున్నారు. కాగా కొత్తగా రెండు షోరూంలు ఓపెన్ చేసేందుకు మరియు రుణభారాన్ని తగ్గించుకునేందుకుగాను 12 కోట్ల సమీకరణ లక్ష్యంగా మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు ముందుకొచ్చింది. ఇందుకుగాను 10.24 లక్షల షేర్లను ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసింది.
అయితే ఎవరూ ఊహించని విధంగా సోమవారం నాటికి 400 రెట్లు ఓవర్ సబ్‌స్రైబ్ అయి విశ్లేషకుల మతిపోగొట్టింది. 12 కోట్ల కోసం మార్కెట్లోకి వచ్చిన కంపెనీ ఏకంగా 2 వేల 700 కోట్లకు సమీకరించే స్థాయికి చేరింది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్స్ సెగ్మెంట్ లోనే దాదాపు 500 రెట్లు సబ్స్క్రిప్షన్స్ లభించాయి. అయితే గత ఏడాది అక్టోబర్ 31 నాటికి కంపెనీ 19 లక్షలకు పైగా నెగెటివ్ క్యాష్ ఫ్లోస్ కలిగి ఉండటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని చూస్తే ఊహాజనిత పెట్టుబడి ట్రాప్ లో ఇన్వెస్టర్లు కూరుకుపోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇంత జరిగినా చివరికి ఇష్యూ ప్రైస్ అయిన 117 వద్ద ఇవాళ సదరు సంస్థ లిస్ట్ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications