ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లు.. ఎక్కవ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులివే..
కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి రాబడి పొందడానికి ప్రజలు ఎక్కువగా నిర్దేశించుకునే సాధనం ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). స్టాక్స్, SIPలు లేదా మ్యూచువల్ ఫండ్స్ (MFలు) వంటి ఈక్విటీల్లో పెట్టుబడులతో పోలిస్తే బ్యాంక్ FD అత్యంత సురక్షితమైన ఎంపికగా పరిగణించబడుతుంది. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు టర్మ్ డిపాజిట్లు లేదా FDలపై అధికంగా వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.
ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై సాధారణ కస్టమర్లకు యూనిటీ బ్యాంక్ 9 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. 1001 రోజుల పైబడిన FDలపై సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం ఇస్తోంది. ఈ రేట్లు మే 2, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజా FD వడ్డీ రేట్లను పరిశీలిస్తే, 700 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 8.25 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 9 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తోంది. ఇక ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం అత్యధికంగా 9.01 శాతం పే చేస్తోంది.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే, సాధారణ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని తెలుస్తోంది. దిగ్గజ బ్యాంకులైన SBI, HDFC మరియు ICICI బ్యాంకులు.. 7 రోజుల నుంచి 10 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే FDలపై 3 నుంచి గరిష్ఠంగా 7.10 శాతం వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్లు అదనంగా అందిస్తున్నాయి.
సాధారణ బ్యాంకులన్నిటిలో ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ సామాన్య ప్రజలకు 3.50 నుంచి 7.20 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు మాత్రం గరిష్ఠంగా 7.95 ఆఫర్ చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరుస హైక్ లతో వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మే 2022 నుంచి చూస్తే, RBI రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది.


Click it and Unblock the Notifications