TOP Small Cap Mutual Funds: అధిక రాబడి, తక్కువ అస్థిరత కలిగిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగష్టు 2026లో ఈ విభాగంలో రూ.7,973 కోట్ల రికార్డు స్థాయి నికర పెట్టుబడులు వచ్చాయి. ఇది యాక్టివ్ ఈక్విటీ ఫండ్ విభాగాలలో అత్యధికం. నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) ప్రకారం 10 అతిపెద్ద స్మాల్-క్యాప్ ఫండ్‌లలో ఏ పథకాలు మూడేళ్లలో అత్యధిక రాబడులను అందించాయో తెలుసుకుందాం. మూడేళ్ల రాబడుల ఆధారంగా, బంధన్ స్మాల్ క్యాప్ 24.38% వార్షిక రాబడితో అగ్రస్థానంలో నిలవగా, దాని తర్వాత ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ 22.36%తో నిలిచింది.
డీఎస్పీ స్మాల్ క్యాప్ 16.99 శాతం, క్వాంట్ స్మాల్ క్యాప్ 16.91 శాతం రాబడులతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐదేళ్ల కాలంలో ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ 20.49%తో అత్యధిక వార్షిక రాబడిని నమోదు చేయగా దాని తర్వాత బంధన్ స్మాల్ క్యాప్ 20.13%తో నిలిచింది. రాబడులను సంపాదించడానికి ఫండ్ పనితీరు ఎంతగా హెచ్చుతగ్గులకు లోనైందో కేవలం రాబడులు మాత్రమే చూపించవు. ఈ అస్థిరతను కొలవడానికి ప్రామాణిక విచలనం (స్టాండర్డ్ డీవియేషన్) ఒక మార్గంగా చెబుతున్నారు. సరళంగా చెప్పాలంటే అధిక ప్రామాణిక విచలనం అంటే ఫండ్ రాబడులు ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయని, అదే తక్కువ సంఖ్య సాపేక్షంగా తక్కువ అస్థిరతను సూచిస్తుందని అర్థం.

ఉదాహరణకు ఫండ్ A, ఫండ్ B రెండూ 14% వార్షిక రాబడులను అందించినప్పటికీ, ఫండ్ A స్టాండర్డ్ డీవియేషన్ 12 శాతం కాగా, ఫండ్ B స్టాండర్డ్ డీవియేషన్ 6% కలిగి ఉంటే, ఫండ్ B రాబడులు తక్కువ అస్థిరతను కలిగి ఉన్నాయని అర్థం. మూడేళ్ల రాబడులు, స్టాండర్డ్ డీవియేషన్ లో 10 ఫండ్ల పోల్చి చూస్తే 10 ఫండ్లలో బంధన్ స్మాల్ క్యాప్ అత్యధిక మూడేళ్ల రాబడిని కలిగి ఉంది. కానీ దాని స్టాండర్డ్ డీవియేషన్ 20.45గా ఉంది. ఇది ఎక్కువ అస్థిరతను కలిగి ఉంది. యాక్సిస్ స్మాల్ క్యాప్ అత్యల్పంగా 16.81 స్టాండర్డ్ డీవియేషన్ కలిగి ఉన్నప్పటికీ దాని మూడేళ్ల రాబడి 15.22 శాతం మాత్రమే ఉంది.
కేటగిరీ సగటు స్టాండర్డ్ డీవియేషన్ 20.25తో పోలిస్తే, బంధన్, DSP, HSBC స్మాల్ క్యాప్ ఫండ్‌లు మాత్రమే అధిక అస్థిరతను కలిగి ఉన్నాయి. మిగిలిన ఫండ్‌లు కేటగిరీ సగటు కంటే తక్కువ స్టాండర్డ్ డీవియేషన్ నమోదు చేశాయి. అందువల్ల స్మాల్-క్యాప్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు, ఒక ఫండ్‌ను కేవలం దాని గత రాబడుల ఆధారంగా మాత్రమే అంచనా వేయకుండా, రాబడులు,స్టాండర్డ్ డీవియేషన్ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
