నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకాయి. కరోనాకు వరదలు కూడా తోడై ఆహార ధాన్యాల , నిత్యావసరాల ఉత్పత్తి పడిపోవడంతో విపరీతంగా పెరిగిన ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ ప్రస్తుత పరిస్థితికి లబోదిబోమంటున్నారు. పనుల్లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతూ ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం జెట్ స్పీడ్ తో పైకి దూసుకుపోతున్నాయి.

విపరీతంగా పెరిగిన ధరలు ... కరోనా , వరదలు కారణం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నూనెల ధరలు 25 శాతం పెరగగా, పప్పుల ధరలు, చింతపండు ధరలు కొనలేనంతగా పెరిగాయి. కరోనా లాక్డౌన్ ప్రభావంతో విదేశాల నుండి దిగుమతి చేసుకునే సరుకుల నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇక మన దేశంలో ఉత్పత్తి అయ్యే చాలావరకూ పప్పు ధాన్యాలు, ఉల్లిగడ్డలు, కూరగాయలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం తోనూ, ఆ తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగానూ, ప్రస్తుతం నివర్ తుఫాన్ కారణంగానూ దెబ్బతిన్నాయి.

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ .. ఇప్పుడు వరదల ప్రభావంతో ఉత్పత్తికి దెబ్బ
కరోనా సమయంలో రవాణా ఇబ్బందులతో నష్టపోయిన రైతులు ఖరీఫ్ లో కొత్తగా కూరగాయల పంటలు వేయకపోవడం , ఇక పంటలు వేసిన ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడం వల్ల నీట మునిగిన పంట కుళ్ళిపోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే చాలా పెరిగిపోయాయి. పప్పుల ధరలు చూస్తే దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడం, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వంటి కారణాలతో పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి.

ఉల్లి ధరలు పెరగటానికి అనేక కారణాలు
ఉల్లిగడ్డలను చూస్తే కిలోకు వంద రూపాయల నుండి 120 రూపాయల ధర పలుకుతోంది కరోనా లాక్డౌన్ ప్రభావంతో రవాణా లేక ఉల్లిగడ్డలు పంట పొలాల్లోనే పాడైపోవడం, ఇప్పుడు తాజాగా కొత్త పంట రాకపోవడం, ఇతర దేశాల నుండి ఉల్లి దిగుమతులను పెద్దగా చేసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉల్లిపాయ ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. ఇక నూనెల ధరలు చూస్తే వేరుశెనగ నూనె మూడేళ్ల కిందట ధరలను బట్టి చూస్తే ఏకంగా 50 శాతం పెరిగినట్లు గా తెలుస్తోంది.

ధరాఘాతం శరాఘాతంగా ... చుక్కలు తాకిన నిత్యావసరాలు
దీంతో సామాన్యుల పాలిట ధరాఘాతం శరాఘాతంగా మారుతుంది. ఒకపక్క పని లేక, మరోపక్క కరోనా మహమ్మారి దాడి, ఇంకోపక్క నింగిని తాకిన, చుక్కలనంటిన నిత్యావసర వస్తువుల ధరలు వెరసి సామాన్యులు బ్రతక లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై దృష్టి సారించి సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా ధరలను నియంత్రించాలని ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. వంటింటి సరుకులు అన్నీ ప్రియం కావడంతో పేద మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం పడుతోంది.


Click it and Unblock the Notifications