బైజూస్ అధినేత బైజూ రవీంద్రన్‌కు బిగ్ షాక్.. 6 నెలలు జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు..
భారతదేశపు ఎడ్‌టెక్ రంగంలో ఒకప్పుడు తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన 'బైజూస్' (Byju's) వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అంతర్జాతీయంగా మరో భారీ షాక్ తగిలింది. సింగపూర్ కోర్టు ఆయనకు కోర్టు ధిక్కరణ నేరం కింద ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ పరిణామం వ్యాపార ప్రపంచంలో కలకలం రేపిన కొద్ది గంటల్లోనే, బైజూ రవీంద్రన్ స్పందిస్తూ తాము రుణదాతలతో ఒక ప్రాథమిక ఒప్పందానికి (Settlement) దాదాపు చేరుకున్నామని ప్రకటించారు.
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 2024 నుండి తన వ్యక్తిగత, కంపెనీ ఆస్తుల వెల్లడికి సంబంధించి సింగపూర్ కోర్టు జారీ చేసిన పలు ఆదేశాలను Byju Raveendran బేఖాతరు చేశారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు గాను ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనితో పాటు వెంటనే అధికారుల ముందు లొంగిపోవాలని (Surrender) ఆదేశించింది.

అలాగే, 90 వేల సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 75 లక్షలు లేదా 70,500 అమెరికన్ డాలర్లు) కోర్టు ఖర్చులను చెల్లించాలని, 'బీయార్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్' (Beeaar Investco Pte) అనే సంస్థలో తనకు ఉన్న చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలను సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సంస్థకు బైజూస్ అనుబంధ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి.
బైజూస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, ఉద్యోగుల తొలగింపులు, ఖర్చుల తగ్గింపు చర్యలు చేపడుతున్న తరుణంలో ఖతార్ సార్వభౌమ నిధి అయిన 'ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ' (QIA) కి చెందిన ఒక విభాగం ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, కంపెనీ పతనం తర్వాత తమ నిధులను రికవరీ చేసుకోవడానికి QIA సింగపూర్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఖతార్ హోల్డింగ్స్ తరఫున ప్రసిద్ధ న్యాయ సంస్థ 'డ్రూ & నాపియర్' వాదించగా.. బైజూస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తరఫున 'ఫెర్వెంట్ ఛాంబర్స్' ప్రాతినిధ్యం వహించాయి.
సింగపూర్ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బైజూ రవీంద్రన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ లీగల్ సెంటిమెంట్‌ను తోసిపుచ్చారు. తమ ప్రధాన రుణదాతలైన గ్లాస్ ట్రస్ట్ (GLAS Trust), ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) లతో తమ చర్చలు దాదాపు ఒక ముగింపునకు వచ్చాయని, కేవలం కొన్ని చిన్న సాంకేతికపరమైన అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
మేము కోర్టుల్లో ఘర్షణ పడటం కంటే సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చాము. అందుకే గత కొన్ని నెలలుగా కోర్టు విచారణలను మేము గట్టిగా సవాలు చేయలేదు. వివాదాల పరిష్కారం దాదాపు కొలిక్కి వస్తున్న ఈ కీలక సమయంలో, నాపై తప్పుడు అభిప్రాయాన్ని (Misleading Impression) సృష్టించేందుకే QIA ఈ కోర్టు ఆర్డర్‌ను తెరపైకి తెచ్చింది. ఈ సెటిల్‌మెంట్ ప్రక్రియలో వ్యవస్థాపకులుగా మా వైపు నుండి ఎలాంటి తప్పు జరగలేదని అన్ని పక్షాలు అంగీకరించాయి."
బైజూస్ సంపాదించిన అత్యంత విలువైన ఆస్తి అయిన 'ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్' (Aakash Educational Services) షేర్లు, నిధుల పంపిణీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అందువల్లనే తాము దూకుడుగా న్యాయపోరాటం చేయలేదని రవీంద్రన్ వర్గాలు తెలిపాయి. ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల (రూ. 1.8 లక్షల కోట్లకు పైగా) గరిష్ట వాల్యుయేషన్‌తో భారతీయ స్టార్టప్ రంగానికి పోస్టర్ బాయ్‌గా నిలిచిన బైజూ రవీంద్రన్ ప్రయాణం ఇప్పుడు అనేక దేశాల్లోని కోర్టుల చుట్టూ తిరుగుతోంది.
అమెరికన్ రుణదాతల నుండి తీసుకున్న 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ రికవరీ కోసం అక్కడి డెలావేర్ బ్యాంక్‌రప్ట్సీ కోర్టు ఇప్పటికే రవీంద్రన్‌ను సివిల్ కోర్టు ధిక్కరణ కింద నిర్ధారించి రోజుకు 10,000 డాలర్ల జరిమానా విధించింది. స్వదేశంలో (భారత్) కూడా బైజూస్ మాతృ సంస్థ 'థింక్ & లెర్న్' దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం బైజూ రవీంద్రన్ సింగపూర్‌లో ఉన్నారా లేదా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఈ ఆరు నెలల జైలు శిక్ష, ఆయన ప్రకటించిన నిధుల సెటిల్‌మెంట్ ఒప్పందం బైజూస్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications
