గతంలో విమాన ప్రయాణాలు చేసేవారు చాలా అరుదు. కానీ మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేయడానికి ప్రజలు వెనకాడటం లేదు. కరోనా అనంతరం విమానయాన రంగానికి డిమాండ్ పెరిగింది. దీంతో పలు ఎయిర్ లైన్స్ సంస్థలు తమ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి.
మెరుగైన ఉద్యోగుల ఉత్పాదకత, వినియోగదారుల అనుభవం కోసం టాటా కమ్యూనికేషన్స్ తో బంధాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ పటిష్ఠం చేసుకుంది. ఇప్పటికే గత ఐదేళ్లుగా ఇరు సంస్థలూ కలిసి పనిచేస్తున్నాయి. కాగా సహకార సాధనాలను అప్ గ్రేడ్ చేసుకునేందుకు రెండు కంపెనీల మధ్య బహుళ-సంవత్సరాల ఒప్పందం కుదిరింది.

తాజాగా ఎయిర్ లైన్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్లకు ఇంటెలిజెన్స్ కాల్ రూటింగ్ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు టాటా కమ్యూనికేషన్స్ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. అదనంగా పైలట్, క్యాబిన్ క్రూ సహకార ప్లాట్‌ఫారమ్‌లకు మరింత పుష్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు త్వరితగతిన ఫ్లైట్ టర్న్-రౌండ్ మరియు మెరుగైన ఆన్-టైమ్ పనితీరు కనబరిచే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించింది.
సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం భారత్ లో చెన్నై, అమృత్ సర్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, తిరువనంతపురం, విశాఖపట్నంలకు విమానాలు నడుపుతోంది. ఈ నగరాల జాబితాను త్వరలో విస్తరించే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ గత వారం నివేదించింది. తాజాగా ఇప్పుడు టాటా కమ్యూనికేషన్స్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో ఒప్పందం గడువు పొడిగించినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications