Income Tax Act 2025: పన్ను వ్యవస్థలో భారీ మార్పులు.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే!
మన దేశ ఆదాయపు పన్ను వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణకు రంగం సిద్ధమైంది. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ.. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) అమల్లోకి రాబోతోంది. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా, అత్యంత సరళంగా రూపొందించబడిన ఈ చట్టం వల్ల పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓ సారి చూద్దాం.

భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం 1961 నుండి అమలులో ఉంది. అంటే సుమారు 64 ఏళ్ల క్రితం రూపొందించిన చట్టం ఇది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇందులో వందలాది సవరణలు చేయడం వల్ల ఇది సామాన్యులకు అర్థం కానంత సంక్లిష్టంగా మారింది. దీనిని పరిష్కరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం (Income Tax Act 2025)ను తీసుకువచ్చింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది ఆగస్టులోనే ఆమోదం తెలిపారు.
పాత చట్టం వర్సెస్ కొత్త చట్టం: తేడాలేంటి?
పాత చట్టం 298 సెక్షన్లు, 23 చాప్టర్లతో చాలా భారీగా ఉండేది. కానీ, కొత్త చట్టం దాని పరిమాణాన్ని 50 శాతం తగ్గించింది. అనవసరమైన సెక్షన్లు, కాలం చెల్లిన నిబంధనలను తొలగించడం ద్వారా చట్టాన్ని సరళతరం చేశారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు మరియు అధికారుల మధ్య వివాదాలు (Litigations) తగ్గి, కోర్టు కేసుల భారం తగ్గుతుంది.
ముఖ్యమైన మార్పులు ఇవే..
కొత్త ట్యాక్స్ ప్రధానంగా 'యూజర్ ఫ్రెండ్లీ'గా ఉండేలా రూపొందించారు.
- సింగిల్ టాక్స్ ఇయర్: ఇప్పటివరకు 'ప్రీవియస్ ఇయర్', 'అసెస్మెంట్ ఇయర్' అనే రెండు వేర్వేరు కాలపరిమితులు ఉండేవి. ఇది సామాన్యులను గందరగోళానికి గురి చేసేది. ఇకపై వీటన్నింటినీ తీసివేసి కేవలం ఒకే ఒక 'టాక్స్ ఇయర్' (Tax Year) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
- TDS రీఫండ్ రూల్స్: ఐటీ రిటర్న్స్ (ITRs) దాఖలు చేయడానికి డెడ్ లైన్ ముగిసినా సరే.. ఎటువంటి జరిమానా లేకుండా టీడీఎస్ రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకునే సౌలభ్యాన్ని ఈ చట్టం కల్పిస్తోంది.
- సరళమైన భాష: చట్టంలో ఉపయోగించే భాషను సులభతరం చేయడం వల్ల పన్ను బాధ్యతలను ఎవరికి వారు స్వయంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
బడ్జెట్ 2026తో అనుసంధానం
ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులకు సంబంధించిన మార్పులను నేరుగా ఈ కొత్త చట్టంలో చేర్చనున్నారు. ఏప్రిల్ 1 నుండి అమలు కాబోయే ఈ నిబంధనల కోసం ప్రస్తుతం విధివిధానాలు (Rules) రూపొందిస్తున్నారు. ఇవి ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత అధికారికంగా నోటిఫై చేయబడతాయి.
చారిత్రక నేపథ్యం
ఈ చట్టాన్ని మార్చడానికి గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. 2010లో డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ (DTC) బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రభుత్వం మారడంతో అది అటకెక్కింది. చివరకు 2017లో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ చారిత్రక మార్పును విజయవంతంగా పూర్తి చేసింది.
మొత్తంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం (New Income Tax Act) అనేది పన్ను చెల్లింపుదారులకు ఒక వరం లాంటిది. పన్ను రేట్లలో మార్పులు లేకపోయినా, పన్నులు చెల్లించే విధానం మాత్రం అత్యంత పారదర్శకంగా, సులభంగా మారబోతోంది.


Click it and Unblock the Notifications