Simone Tata: టాటా గ్రూప్‌లో విషాదం! లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత!
రతన్ టాటా పెంపుడు తల్లి, ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా (Simone Tata) 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో శుక్రవారం ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలతో పోరాడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో ఈ విషాదం జరిగింది.

సిమోన్ టాటా భారతదేశంలో బ్యూటీ, రిటైల్ రంగాలపై చెరగని ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె ఈ రంగాల్లో కీలక పాత్ర పోషించారు. ఆమె కృషి ఫలితంగానే నేడు ప్రసిద్ధి చెందిన లాక్మే (Lakme), వెస్ట్‌సైడ్ (Westside) వంటి బ్రాండ్లు రూపుదిద్దుకున్నాయి.
లాక్మే పుట్టుక..
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన సిమోన్ టాటా.. 1953లో పర్యాటకురాలిగా భారతదేశాన్ని సందర్శించారు. 1955లో ఆమె నవల్ టాటాను వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి ముంబైలో స్థిరపడ్డారు. భారతదేశ మహిళలు విదేశీ సౌందర్య సాధనాలపై ఆధారపడకుండా ఉండటానికి దేశీయ మేకప్ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ టాటా గ్రూప్‌ను కోరారు. ఆ పిలుపుతోనే 1952లో టాటా గ్రూప్ లాక్మే బ్రాండ్‌ను స్థాపించింది. 1980ల ప్రారంభంలో సిమోన్ టాటా లాక్మే ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి, దాన్ని భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన బ్యూటీ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు.
వెస్ట్‌సైడ్ స్థాపన..
1996లో టాటా గ్రూప్ వ్యాపార విస్తరణలో భాగంగా లాక్మేను హిందుస్థాన్ యూనిలీవర్‌కు విక్రయించింది. ఈ అమ్మకం ద్వారా వచ్చిన నిధులను సిమోన్ టాటా వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. ఆ నిధులతో ట్రెంట్ లిమిటెడ్ (Trent Ltd.) అనే రిటైల్ సంస్థను స్థాపించి.. దాని క్రింద వెస్ట్‌సైడ్ (Westside) డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌ను ప్రారంభించారు. నేడు వెస్ట్‌సైడ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రిటైల్ చైన్‌లలో ఒకటిగా ఎదగడంలో సిమోన్ టాటా కృషి ప్రధానమైనది. ఆమె 2006 వరకు ట్రెంట్‌కు నాయకత్వం వహించారు. ఆమె టాటా ఇండస్ట్రీస్ బోర్డులో కూడా సేవలందించారు.
వ్యక్తిగత జీవితం
సిమోన్ టాటా.. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు పెంపుడు తల్లి. 2006లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆమె బహిరంగ కార్యక్రమాలలో అరుదుగా కనిపించారు. 2024 అక్టోబర్‌లో పార్కిన్సన్స్ వ్యాధి సమస్యలతో కన్నుమూసిన రతన్ టాటా అంత్యక్రియల్లో ఆమె చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత నోయెల్ టాటా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిమోన్ టాటా మరణం భారతీయ వ్యాపార ప్రపంచానికి తీరని లోటు అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications