ఫోన్ సిగ్నల్ పోయిందా? జాగ్రత్త.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసే కొత్త సిమ్ క్లోనింగ్ దందా!
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్.. వారి బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ (UPI) ఐడీలు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ , ఈమెయిల్స్‌తో లింక్ అయి ఉంది. మన డిజిటల్ లైఫ్‌కు ఈ నెంబరే కీలక ఆధారం. అయితే, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు దీనినే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో "సిమ్ కార్డ్ క్లోనింగ్" లేదా "సిమ్ స్వాప్" (SIM Swap) అనే స్కామ్ (scam) విపరీతంగా పెరిగిపోతోంది. ఈ మోసంలో క్రిమినల్స్ మీ మొబైల్ నెంబర్‌ను వారి ఆధీనంలోకి తీసుకుని, నిమిషాల వ్యవధిలోనే మీ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బునంతా ఊడ్చేస్తున్నారు.

అందరూ ఇగ్నోర్ చేసే ఆ పెద్ద వార్నింగ్ సైన్ ఏంటి?
ఈ సిమ్ స్వాప్ మోసంలో మనకు తెలియకుండానే మన నెంబర్ బ్లాక్ అయిపోతుంది. మీ ఫోన్‌లో అప్పటికప్పుడు నెట్‌వర్క్ సిగ్నల్ పూర్తిగా పోయి, "No Service" లేదా "Emergency Calls Only" అని చూపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు. మీ చుట్టుపక్కల ఒకే నెట్‌వర్క్ వాడుతున్న మిగతా వాళ్లందరికీ సిగ్నల్ ఉండి, మీ ఫోన్‌లో మాత్రం చాలా సేపటి వరకు సిగ్నల్ రాకపోతే అది ఒక పెద్ద ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఎందుకంటే, మీ నెంబర్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి మార్చుకున్నప్పుడు మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్ ఇన్‌యాక్టివ్ (పనిచేయకుండా) అయిపోతుంది.
అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
సైబర్ దొంగలు ముందుగా దొంగిలించిన మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా ఐడీ ప్రూఫ్ వివరాలను వాడుకుంటారు. వాటితో టెలికాం ఆపరేటర్లను (కస్టమర్ కేర్‌ను) నమ్మించి.. మీ సిమ్ కార్డ్ పోయిందని లేదా పాడైపోయిందని చెప్పి, మీ నెంబర్‌పై కొత్త సిమ్ కార్డును తీసుకుంటారు. ఆ కొత్త సిమ్ కార్డ్ ఆక్టివేట్ అవ్వగానే, మీ ఫోన్‌లో సిగ్నల్ కట్ అవుతుంది. ఆ తర్వాత క్రిమినల్స్ మీ బ్యాంకింగ్ యాప్స్ లేదా ఈమెయిల్స్ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి వచ్చే ఓటీపీలు (OTPs) అన్నీ నేరుగా హ్యాకర్ దగ్గరున్న కొత్త సిమ్ కార్డుకు వెళ్తాయి. దాంతో వాళ్లు చాలా ఈజీగా మీ అకౌంట్ల నుండి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు.
మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా?
ఈ ప్రమాదకరమైన స్కామ్ (scam) నుండి సురక్షితంగా ఉండటానికి సెక్యూరిటీ నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను చెప్తున్నారు..
- యాప్ ఆధారిత అథెంటికేషన్: కేవలం ఎస్ఎంఎస్ (SMS) ఓటీపీలపైనే ఆధారపడకుండా, గూగుల్ అథెంటికేటర్ వంటి యాప్ బేస్డ్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోండి.
- రహస్య వివరాలు దాచండి: ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లలో ఎవరికీ మీ ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్లు లేదా సిమ్ వెరిఫికేషన్ కోడ్‌లను షేర్ చేయవద్దు. ముఖ్యంగా కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పే గుర్తుతెలియని వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.
- సిమ్ పిన్ (SIM PIN): మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ సిమ్ కార్డుకు ఒక స్ట్రాంగ్ పిన్ నెంబర్ సెట్ చేసుకోండి. ఇది మీ సిమ్‌కు అదనపు రక్షణ ఇస్తుంది.
సిగ్నల్ అకస్మాత్తుగా పోతే ఏం చేయాలి?
మీ మొబైల్ సిగ్నల్ అకస్మాత్తుగా పోయి, ఎంతసేపటికీ రాకపోతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేరే ఫోన్ నుండి వెంటనే మీ టెలికాం కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. మీ నెంబర్‌పై ఏదైనా కొత్త సిమ్ రీప్లేస్‌మెంట్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందేమో అడిగి తెలుసుకోండి. ఒకవేళ స్కామ్ జరిగిందని అనుమానం వస్తే, వెంటనే మీ బ్యాంకులకు సమాచారం ఇచ్చి అకౌంట్లను బ్లాక్ చేయించండి. ఇలాంటి విషయాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే అలర్ట్ అవ్వడం వల్ల మీ కష్టార్జితం దొంగల పాలు కాకుండా కాపాడుకోవచ్చు!


Click it and Unblock the Notifications