Silver Hits New High: ఇప్పటివరకు మార్కెట్లో బంగారం పెరుగుదలను చూశాం.. అయితే ఇప్పుడు నేనేమి తక్కువ తినలేదన్నట్లుగా వెండి బంగారంతొ పోటీ పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధర నింగిని తాకింది. ఏకంగా 12 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. MCX ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,04,947 దాటింది. ఇక కామెక్స్‌లో వెండి ఔన్సుకు 34.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్టు 2012 తర్వాత అత్యధిక స్థాయిలో ఈ ధర పలకడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధరలు బుధవారం ఔన్సుకు 2.8% పెరిగి 35.43 డాలర్లకు చేరుకున్నాయి.
వెండి ధరలు పెరగడానికి ప్రధానంగా కారణాలు చూస్తే.. లోహాలకు డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితితో పాటుగా పెట్టుబడిదారుల ఆసక్తి పెరగ డం వంటివి సిల్వర్ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు వెండి ధరను పెరిగేలా చేస్తున్నాయి. వడ్డీ రేట్లలో కోతల ఉంటాయనే వార్తల నేపథ్యంలో వెండికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించి డాలర్ బలహీనపడితే..వెండి కిలోకు రూ 1.10 లక్షల వరకు స్థాయిలను చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చి 27న వెండి కిలో రూ. 1,01,313 పలికింది. తాజాగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రకారం జూన్ 4 న వెండి ఫ్యూచర్స్ రూ.1,04,947 వద్ద తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది.ఇక ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం వెండి స్పాట్ ధరలు ఈ వారం ప్రారంభం నుండి రూ.1 లక్ష మార్కును దాటి ట్రేడవుతున్నాయి.కాగా గత రెండు నెలల్లో వెండి రూ.1 లక్ష మార్కును అనేకసార్లు దాటిందని ఐబిఎ తెలిపింది.ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా దీనికి బలమైన పారిశ్రామిక డిమాండ్ పెరుగుదలకు దారితీసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన రాజకీయ ఉద్రిక్తతలు, తగ్గుముఖం పట్టిన డాలర్ విలువ ప్రధానంగా వెండి పెరుగుదలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా కారణమవుతోంది. ఈ పెంపు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల చుట్టూ కొనసాగుతున్న వాణిజ్య అనిశ్చితుల కారణంగా మార్కెట్ అస్థిరత పెరుగుతూనే ఉంటుందని కేడియా అడ్వైజరీలో సీనియర్ పరిశోధన విశ్లేషకుడు అమిత్ గుప్తా అన్నారు. ఈ పరిణామాల మధ్య వెండి ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో కిలో వెండి రూ. 1,30,000 కు చేరుకునే అవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications