silver rate: వెండి ధరల విధ్వంసం.. 2.5 లక్షల రికార్డు.. ఆపై భారీ పతనం! ఇప్పుడు కొనాలా? వద్దా?
వెండి ధరలు(silver rate) ప్రస్తుతం ఒక 'రోలర్ కోస్టర్ రైడ్'లా కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కిలో వెండి ధర ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో రూ.2,54,174 వద్ద ఆల్‌టైమ్ రికార్డును సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. సాయంత్రం కల్లా ధర ఏకంగా 5% పైగా పడిపోయి, సుమారు రూ.2,25,954 వద్ద స్థిరపడింది. అంటే ఒక్కరోజే ఏకంగా రూ.22,000 పైగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ పరిణామాలు చూస్తుంటే సామాన్య ఇన్వెస్టర్లు భయపడటం సహజమే.

అసలు ఈ 'మెరుపు' పతనం ఎందుకు?
మార్కెట్ నిపుణుల ప్రకారం.. వెండి ధరలు(silver rate) అకస్మాత్తుగా పడిపోవడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన CME గ్రూప్ వెండి ట్రేడింగ్‌పై మార్జిన్ రిక్వైర్మెంట్‌ను 20,000 డాలర్ల నుండి 25,000 డాలర్లకు పెంచింది. ఇది ఇన్వెస్టర్ల మీద ఒత్తిడి పెంచి అమ్మకాలు పెరిగేలా చేసింది. అలాగే ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జియోపాలిటికల్ రిస్క్‌ను తగ్గించాయి. దీంతో సేఫ్ హెవెన్ అసెట్ అయిన వెండిపై పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఇక దీంతోపాటు చైనా ఎగుమతులపై లైసెన్సింగ్ నిబంధనలు తీసుకురావడం మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టించింది.
బబుల్ పేలిందా? లేక ఇది మంచి అవకాశమా?
వెండి ధరలు (silver rate) ప్రస్తుతం ఒక 'స్పెక్యులేటివ్ బబుల్' (ధరల బుడగ)లో ఉన్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ధరలు వాస్తవం కంటే ఎక్కువగా పెరిగాయని వారి అభిప్రాయం. ఒకవేళ పెద్ద ఎత్తున కరెక్షన్ జరిగితే కిలో వెండి ధర రూ.1,50,000 వరకు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ 2026 నాటికి తిరిగి ఇది రూ. 2,75,000 మార్కును తాకే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తొందరపడి కొనొద్దు!
ఇక ఇన్వెస్ట్ మెంట్స్ విషయానికొస్తే.. ప్రముఖ మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరక్షకర్ ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు. "అందరూ ఒకేసారి ఒక వస్తువును ఎగబడి కొంటున్నారంటే.. అక్కడ ఏదో తేడా ఉందని అర్థం" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వెండి ధరలు టెక్నికల్ అనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న గరిష్ట ధరల వద్ద పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే ధర కొద్దిగా తగ్గేవరకు వేచి చూడటం ఉత్తమమని ఆయన అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ధర కనీసం 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, అప్పుడు కొంటే లాభదాయకంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు.
దీర్ఘకాలికంగా చూస్తే లాభమేనా?
వెండి ధరలు షార్ట్ టర్మ్ లో తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. లాంగ్ టర్మ్ (దీర్ఘకాలికం)లో మాత్రం వెండికి తిరుగులేదని విశ్లేషకులు భావిస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద చూస్తే.. రాబోయే రోజుల్లో వెండి మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా వెండి అత్యంత కీలకం కానుంది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మీరు ఒకేసారి భారీగా వెండిని కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న వెండి ధరలను(silver rate) చూసి తొందరపడకుండా.. దానికి బదులుగా ఈ క్రింది పద్ధతులను పాటించవచ్చు..
- SIP పద్ధతి: ప్రతి నెలా కొద్దికొద్దిగా వెండిని కొనడం ద్వారా ధరల హెచ్చుతగ్గుల నుండి తప్పించుకోవచ్చు.
- సిల్వర్ ETFs: ఫిజికల్ సిల్వర్ కంటే ఈటీఎఫ్ (Silver ETFs)లలో పెట్టుబడి పెట్టడం సేఫ్ మరియు సులభం.
- తగ్గింపు కోసం వేచి చూడండి: మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయినప్పుడు (Buy on Dips) కొనుగోలు చేస్తే ఎక్కువ లాభం వస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే.. వెండి మెరుపులు ఇప్పుడప్పుడే ఆగిపోయేలా లేవు. కానీ రోలర్ కోస్టర్ రైడ్ లో చిక్కుకుపోవడం కంటే.. ఓపికగా ఉండి సరైన సమయంలో పెట్టుబడి పెట్టడమే తెలివైన నిర్ణయం. కాబట్టి తొందర పడకుండా సరైన వ్యూహంతో పెట్టుబడి పెట్టండి!


Click it and Unblock the Notifications