బంగారం VS వెండి: ఫ్యూచర్లో ఏది ఎక్కువ లాభాలను ఇస్తుంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గోల్డెన్ రేషియో!
గత ఏడాది కాలంగా కమోడిటీ మార్కెట్‌లో వెండి (Silver) అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతోంది. కేవలం 12 నెలల కాలంలోనే వెండి ఏకంగా 200 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఇదే సమయంలో బంగారం కేవలం 80 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇంతటి భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు వెండి కంటే బంగారమే మేలైన పెట్టుబడి అని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తన తాజా నివేదికలో వెల్లడించింది. అసలు ఇంతకీ ప్రస్తుత పరిస్థితుల్లొ ఎందులో ఇన్వెస్ట్ చేయడం సరైన ఆప్షన్ అవుతుంది.? నిపుణుల సూచన ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గోల్డ్-సిల్వర్ రేషియోలో మార్పు
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం, గతంలో కరోనా సమయంలో 127 గా ఉన్న గోల్డ్-సిల్వర్ రేషియో.. 2026 ప్రారంభం నాటికి 50 స్థాయికి పడిపోయింది. అంటే బంగారం ధరతో పోలిస్తే వెండి ధర చాలా వేగంగా పెరిగిందని దీని అర్థం. ఈ రేషియో ఇంతలా తగ్గడం వల్ల, స్వల్పకాలంలో (Near-term) వెండి కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తక్కువగా ఉండి, లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వెండిలో ఇప్పటికే భారీ ర్యాలీ వచ్చినందున, రాబోయే రోజుల్లో ఇందులో ఒడిదుడుకులు (Volatility) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వెండి ధర రూ. 3.20 లక్షలకు.. ఆ తర్వాత ఏంటి?
గతంలో కిలో రూ. 60,000 వద్ద ఉన్న వెండి ధర ఇప్పుడు ఏకంగా రూ. 3,20,000 స్థాయికి చేరుకుంది. ఇంతటి వేగవంతమైన పెరుగుదల తర్వాత ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడం సహజం. వెండికి పారిశ్రామికంగా డిమాండ్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత రేట్ల వద్ద కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారికి బంగారం మంచి ఎంట్రీ పాయింట్ అని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ పేర్కొన్నారు. వెండిపై మాకు నెగటివ్ అభిప్రాయం లేదని, అయితే రిస్క్ మేనేజ్‌మెంట్ లో భాగంగా బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి? (రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ)
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీని ఉపయోగించాలి. అంటే విలువైన లోహాలపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు 75 శాతం బంగారానికి, 25 శాతం వెండికి (Silver) కేటాయించాలని మోతీలాల్ ఓస్వాల్ సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పెరగడం, చైనా, అమెరికా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం (Safe-haven) వైపు మొగ్గు చూపడం మంచిదని నివేదిక స్పష్టం చేస్తోంది. గ్లోబల్ ఈటీఎఫ్ (ETF) లలో కూడా వెండి నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్తుండగా, బంగారం ఈటీఎఫ్ లలోకి నిలకడగా పెట్టుబడులు వస్తున్నాయి.
మొత్తంగా ఈ అనాలసిస్ ను బట్ట చూస్తే.. దీర్ఘకాలికంగా వెండి మంచిదే అయినా, ప్రస్తుతానికి మాత్రం బంగారంపై దృష్టి పెట్టడం తెలివైన పని అని తెలుస్తుంది. ఇన్వెస్టర్లు నిపుణులైన ఆర్థిక సలహాదారుల సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications