అంతర్జాతీయంగా వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో సిల్వర్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. మన దేశీయ మార్కెట్లో కూడా వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి మరోసారి వెండిపై తన బలమైన ర్యాలీ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో బంగారం కంటే కూడా Silver ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉందని.. 2026 నాటికి వెండి ధర ఔన్సుకు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. ఇది ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే 100 శాతం కంటే ఎక్కువ లాభాన్ని సూచిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో COMEX వెండి ధరలు తాజాగా 1.2 శాతం పెరిగి ఔన్సుకు 94 డాలర్లకి పైగా చేరాయి. అంతకు ముందు రోజు 2.3 శాతం వరకు తగ్గిన ధరలు తిరిగి పుంజుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గడంతో రోజు ప్రారంభంలో వెండి ధరలు ఒత్తిడిలోకి వెళ్లాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ విషయంలో దూకుడు సుంకాల బెదిరింపుల నుంచి వెనక్కి తగ్గి NATO ఫ్రేమ్‌వర్క్ వైపు మొగ్గు చూపడం తక్షణ రాజకీయ రిస్క్‌ను తగ్గించింది.

మరోవైపు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడిదారులను ఇంకా కలవరపెడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై రాజకీయ ఒత్తిడి కొనసాగుతుండటం, అంచనాల కంటే బలహీనంగా ఉన్న అమెరికా గృహ విక్రయాల డేటా, అలాగే జపాన్ ప్రభుత్వ బాండ్లలో చోటు చేసుకున్న భారీ అమ్మకాలు మార్కెట్లలో ఆందోళనను పెంచాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, పెట్టుబడిదారులు మళ్లీ సురక్షితమైన పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద కొనసాగుతుండటంతో.. ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతుందా అనే ప్రశ్న పెట్టుబడిదారులలో చర్చకు వస్తోంది. జనవరి 22న సోషల్ మీడియా వేదిక Xలో చేసిన ఒక పోస్ట్‌లో.. రాబర్ట్ కియోసాకి బంగారం కంటే వెండినే తాను ఎక్కువగా ఇష్టపడుతున్నానని స్పష్టం చేశారు. బంగారం, వెండి రెండూ వేల సంవత్సరాలుగా డబ్బుగా ఉపయోగంలో ఉన్నప్పటికీ, నేటి సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వెండికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.
కియోసాకి అభిప్రాయం ప్రకారం.. వెండి ఇప్పుడు కేవలం విలువ నిల్వగా మాత్రమే కాకుండా, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిర్మాణ లోహంగా మారింది. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో.. నేటి టెక్నాలజీ యుగంలో వెండి కూడా అంతే కీలకమని ఆయన పోల్చిచెప్పారు. సౌర విద్యుత్ ఫలకాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య పరికరాలు, అధునాతన రక్షణ సాంకేతికత వంటి అనేక రంగాల్లో వెండికి విస్తృత డిమాండ్ ఉందని తెలిపారు.
1990లలో ఔన్సుకు కేవలం 5 డాలర్లుగా ఉన్న వెండి ధర, ప్రస్తుతం 90 డాలర్లు దాటిందని గుర్తు చేసిన కియోసాకి.. ఈ వృద్ధి ఇంకా కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే తన అంచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయని హామీ ఇవ్వలేనని కూడా కియోసాకి స్పష్టం చేశారు. మార్కెట్లలో అనిశ్చితి ఎప్పుడూ ఉంటుందని.. కాబట్టి తన అంచనా తప్పు కావచ్చునని కూడా ఆయన అంగీకరించారు. అయినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న పరిశ్రమల డిమాండ్, పెట్టుబడిదారుల ఆసక్తి చూస్తే.. వెండి రాబోయే సంవత్సరాల్లో కీలక పెట్టుబడి అవకాశంగా మారవచ్చని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications