Silver Rate: 100 రోజుల్లో రూ.10 వేలు పరుగు.. త్వరలో కేజీ రేటు రూ.లక్ష.. పూర్తి వివరాలు
Silver Price News: గత కొంత కాలంగా వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నడూ లేని రీతిలో 100 రోజుల్లోనే వెండి కేజీకి రూ.10 వేలు, బంగారం 10 గ్రాములకు రూ.10,000 రేటు పెరిగాయి. ఈ ఏడాది ఆభరణాల డిమాండ్ భారీగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రేట్లలో ర్యాలీ కొనసాగుతుందని వారు చెబుతున్నారు.
దేశంలో 2024లో వెండి ధరలు స్థిరమైన పెరుగుదలను కొనసాగించాయి. వెండి ధరలు గత ఏడాది దాదాపు 7.19 శాతం పెరిగిన తర్వాత ప్రస్తుతం 2024లో చారిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం వెండి ధరలు దాదాపు రూ.90,000 మార్కును దేశంలో చేరుకోవటం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ ఔట్‌లుక్ ప్రకారం మధ్య నుంచి దీర్ఘకాలంలో కేజీ రేటు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి బ్రోకరేజ్ సంస్థ ప్రస్తుతం కొనుగోలు చేయెుచ్చని సలహా ఇస్తోంది. రూ.92 వేల మార్క్ తర్వాత రూ.లక్ష వరకు రేటు చేరుకోవచ్చని తెలపగా.. మరో పక్క రూ.75 వేల వరకు రేటు డిప్‌లలో కొనుగోలుకు అవకాశాలను వినియోగించుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది. అంతర్జాతీయ మార్కెట్‌లలో వెండి ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సానుకూల సెంటిమెంట్ ప్రతిధ్వనిస్తోందని బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
అయితే వెండి ధరల్లో పెరుగుదల ప్రభావం భారతదేశంలో ఏమిటనే ఆలోచన చాలా మందిలో ఉంది. వాస్తవానికి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది తగ్గించాలని భావిస్తుండటంతో పాటు.. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సురక్షితమైన పెట్టుబడి స్వర్గధామాల్లో ఒకటైన వెండికి డిమాండ్ పెంచాయి. అలాగే 2024లో కేవలం రెండు నెలల్లోనే వెండి దిగుమతులు 2500 టన్నులు దాటి సెంటిమెంట్‌కు ఊతమిచ్చాయి. 2023లో ఫోటోవోల్టాయిక్స్ (PV)లో ఉపయోగించిన వెండి డిమాండ్ దాదాపు 161 మిలియన్ ఔన్సులుగా అంచనా వేయబడిందని సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఇది మొత్తం ప్రపంచ వెండి డిమాండ్‌లో దాదాపు 13%గా ఉండటం కూడా రేట్ల పెంపును ప్రేరేపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి డిమాండ్ పెరగటం పరోక్షంగా వెండి ధరలను ఆకాశానికి చేరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి సరఫరా మార్కెట్ డైనమిక్స్‌ను ప్రభావితం చేసే అనేక సవాళ్లను ఎదుర్కొంది. గనుల వద్ద కార్యాచరణ అంతరాయాలు, ముఖ్యమైన వెండి ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో ఉత్పత్తి స్థాయిలను పరిమితం చేసే పర్యావరణ నిబంధనలు రేట్ల పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయి. 2024లో మొత్తం ప్రపంచ వెండి సరఫరా 3% పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అలాగే 2024 కోసం అంచనా వేసిన ప్రపంచ వెండి డిమాండ్ 1.2 బిలియన్ ఔన్సుల వద్ద ఉంది. గ్లోబల్ సిల్వర్ డిమాండ్ 1% పెరుగుతుందని సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ అంచనాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications