వెండి ధరల్లో ఊహించని మార్పు..రాత్రికి రాత్రే 44 మంది వ్యాపారులు దివాలా.. కారణం ఏంటంటే..
ప్రపంచ వ్యాప్తంగా వెండి ధరలు పెరగడం భారతదేశంలోని స్థానిక మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెండి ట్రేడింగ్ మార్కెట్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని స్థానిక వార్తాపత్రిక గుజరాత్ మిర్రర్ నివేదించింది.దీంతో రాత్రికి రాత్రే 44 మంది వెండి వ్యాపారులు దివాలా తీశారని కథనం పేర్కొంది. స్థానిక వార్తాపత్రిక గుజరాత్ మిర్రర్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ వెండి ధరల ఉప్పెన కారణంగా నగరంలో 44 మంది వెండి వ్యాపారులు దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి ఎదురైంది. వీరంతా కలిపి సుమారు రూ.3,500 కోట్ల వరకు బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యారని నివేదిక వెల్లడించింది.
రాజ్‌కోట్ వెండి మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రముఖంగా గుర్తింపు పొందినది. సాధారణంగా ఇక్కడి వ్యాపారులు ధరల కదలికలను అంచనా వేసుకుంటూ పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి వెండి ధరలు ఒక స్థాయిని దాటవని నమ్మిన వ్యాపారులు భారీగా తక్కువ ధరలకు ముందుగానే అమ్మకాలు (షార్ట్ సెల్లింగ్) చేయడంతో సమస్య మొదలైంది. కిలో వెండి ధర రూ.1.25 లక్షలను దాటుతుందని వారు ఊహించకపోవడమే ఈ సంక్షోభానికి మూలకారణంగా మారింది.

నివేదిక ప్రకారం.. 2025 తర్వాత వెండి మంచి రాబడిని ఇస్తుందని అంచనా వేసినప్పటికీ, ధరలలోని అస్థిరత అనేక మంది వ్యాపారులను చిక్కుల్లో పడేసింది. మార్కెట్ మరింత వేగంగా పుంజుకున్న కొద్దీ, అమ్మిన ధర,ప్రస్తుత మార్కెట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసం.. స్థానికంగా వాలన్ గా పిలిచే అంతరం అదుపు చేయలేని స్థాయికి పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని భరించే ఆర్థిక సామర్థ్యం చాలామంది వ్యాపారులకు లేకపోయింది.
ఈ పరిస్థితి తీవ్రతరమైన నేపథ్యంలో.. శనివారం రాత్రి రాజ్‌కోట్ వెండి వ్యాపారులు ఒక అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో 44 మంది వ్యాపారులు తాము అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నామని అంగీకరించి.. వాస్తవానికి మార్కెట్ పతనానికి లొంగిపోయినట్లు సమాచారం. ఈ పరిణామం రాజ్‌కోట్ మార్కెట్‌ను కుదిపేసింది. ఈ సంక్షోభ ప్రభావం రాజ్‌కోట్‌కే పరిమితం కాలేదు. వెండి వ్యాపారంతో అనుసంధానమైన వాణిజ్య నెట్‌వర్క్‌ల ద్వారా అహ్మదాబాద్, ఇండోర్, దుబాయ్ వంటి నగరాలకు కూడా ఈ సంక్షోభం విస్తరించింది. అక్కడి వ్యాపారులు, ఫైనాన్సర్లు కూడా రాజ్‌కోట్‌తో ఉన్న లావాదేవీలను ఇప్పుడు తిరిగి లెక్కించుకుంటున్నారని సమాచారం.
గుజరాత్ మిర్రర్ నివేదికలో పేర్కొన్నట్లుగా.. ధర రూ.1.25 లక్షల పరిమితిని దాటదని డీలర్లు నమ్మకంగా ఉన్నారు. అందుకే అమ్మకాలు కొనసాగించారు. కానీ ఆ స్థాయి దాటిన వెంటనే ధర వ్యత్యాసం భరించలేని భారంగా మారింది. ఈ క్రాష్ నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మార్కెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారని కూడా కథనం పేర్కొంది.


Click it and Unblock the Notifications