ఇన్వెస్టర్లకు శుభవార్త... త్వరలోనే మీ కోసం మరో పెట్టుబడి సాధనం అందుబాటులోకి రాబోతోంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అదేమిటంటే.. వెండిలో ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్). ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజిమెంట్ కంపెనీ (ఏఎంసి), నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) లు సిల్వర్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ప్రారంభించే పనిలో ఉన్నాయి. దీనికి మంచి ఆదరణ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

బంగారంలో ఇప్పటికే...
* బంగారంలో విభిన్న మార్గాల ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
* బంగారంలో డిజిటల్ రూపంలో, భౌతికంగా, ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్, సార్వభౌమ బాండ్ల ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉంటున్నాయి. వీటిని అనేక మంది ఇన్వెస్టర్లు వినియోగించుకుంటున్నారు. కాబట్టి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే వెండి ఈటీఎఫ్ లను అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. వీటి వల్ల ఇన్వెస్టర్లు వెండిలోను పెట్టుబడులు పెట్టి ప్రయోజనాలను పొందడానికి అవకాశాలు ఉంటాయన్న మాట.
* ఇప్పటిదాకా ఇన్వెస్టర్లు భౌతిక రూపంలో ఉన్న వెండిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.

గతంలో ప్రయత్నాలు
* బంగారంలో ఈటీఎఫ్ లకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో వెండి, ముడి చమురులో ఈటీఎఫ్ లను తీసుకురావాలన్న ప్రయత్నాలు జరిగాయి.
* అయితే వీటికి సంభందించిన న్యాయ పరమైన అంశాల్లో స్పష్టత లేకపోవడం, కమొడిటీలకు సంబంధించి ప్రత్యేక రెగ్యులేటర్లు లేకపోవడం వంటి అంశాల మూలంగా ఇవి అందుబాటులోకి రాలేక పోయాయి.
* ప్రస్తుతం కమొడిటీలు, స్టాక్ ఎక్స్చేంజి ల ను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా నియంత్రిస్తుంది.
* ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫండ్ సంస్థలు సిల్వర్ ఈటీఎఫ్ లను ప్రారంభించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.
* ఈ నేపథ్యంలోనే కొన్ని పెద్ద ఫండ్ సంస్థలువెండిలో ఈటీఎఫ్ లను ప్రారంభించే ప్రతిపాదనల్లో ఉన్నాయని సమాచారం.

ఎనిమిదేళ్ల క్రితం ...
* సెబీ 2010-11 సంవత్సరంలోనే సిల్వర్ ఈటీఎఫ్‌లను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. అయితే అప్పుడు ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్, రెగ్యులేటర్ కమోడిటీ డెరివేటివ్స్ దీని పట్ల అభ్యంతరం తెలిపాయి. ఈ నేపథ్యంలో సెబీ, ఎన్ ఎస్ ఈ లు తమ అనుమతులను విరమించుకున్నాయి. ఫలితంగా సిల్వర్ ఈటీఎఫ్ లను ప్రారంభించే అవకాశం లభించలేదు.


Click it and Unblock the Notifications