అమెరికాలో కంపెనీ సీఈఓకి తెగిన పంది తల పార్సిల్..నీ లాంటి పంది ఈ ప్రపంచంలో ఉండకూడదని లేఖ..
లాస్ వెగాస్‌కి చెందిన అగ్రిప్పా వ్యవస్థాపకుడు, CEO బ్లేక్ ఓవెన్స్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇటీవల తన ఇంటికి వచ్చిన ఒక వింత ప్యాకేజ్‌తో ఒక్కసారిగా ఆయన ప్రాణం పోయినంత పనైంది. ఇంటికి వచ్చిన ప్యాకేజీ విప్పి చూడగా.. అందులో తెగిన పంది తలతో పాటుగా చంపేస్తామనే ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. అయితే ఈ ఘటన వెనుక కారణం తన కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) వినియోగం కావచ్చని ఆయన భావిస్తున్నారు.
KLAS 8 న్యూస్ నౌ కథనం ప్రకారం.. ఓవెన్స్ ఒక రియల్ ఎస్టేట్ ఒప్పందంలో AI వినియోగం గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. జూలై 29న ఈ ప్యాకేజ్ ఆయన ఇంటికి చేరింది. లేఖలో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. క్లార్క్ కెంట్ నాక్‌ఆఫ్ అంటూ ఎగతాళి చేశారు. పందులు లావుగా మారతాయి, పందులు వధించబడతాయి కాబట్టి అత్యాశ పడకండి అంటూ అతనిని ఉద్దేశించి చివర్లో దారుణ రాతలు రాశారు. అయితే అతనెవరో తెలియకుండా.. లేఖపై కేవలం ఎమ్ అనే అక్షరంతో లేఖను పంపాడు.

లేఖలో.. రియల్ ఎస్టేట్ రంగాన్ని AI భర్తీ చేయలేదని, డెవలపర్లు లేదా పెట్టుబడిదారులు కాకుండా బ్రోకర్లు మాత్రమే ఈ రంగాన్ని నిర్మించారని రాసుకొచ్చారు. టెక్నాలజీ కాదు, మనుషులే ఈ రంగాన్ని నిర్మించారు. కాబట్టి నీ సమయం ముగిసే వరకు ఆనందించు. షార్ట్‌కట్‌లు లేవు, కేవలం కష్టమని పేర్కొన్నారు. అలాగే, AI ద్వారా ఉద్యోగాలు పోతాయని చెప్పే కథలు తన కోపానికి కారణమై ఉండవచ్చని ఓవెన్స్ అంచనా వేశారు.
ఈ సంఘటనపై ఆయన స్పందిస్తూ.. చనిపోయిన జంతువును నాకు మెయిల్ చేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. బహుశా ఈ వ్యక్తి ది గాడ్ ఫాదర్ సినిమాను ఎక్కువ సార్లు చూసి ఉండవచ్చని వ్యంగ్యంగా అన్నారు. అయితే, ఈ సంఘటనను తాను తేలికగా తీసుకోవడం లేదన్నారు. దానిని ఒక గంభీరమైన సందేశంగా పరిగణిస్తున్నానని తెలిపారు.ఇది నన్ను భయపెట్టే విధమైన బెదిరింపు కాకపోవచ్చన్నారు. లేఖ పంపిన వ్యక్తికి వ్యాపారం బాగా జరగకపోవడం వల్ల నిరాశలో ఉండి పంపి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. AI భర్తీ కథలు విని ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నట్లు తెలిపారు.
అయితే అనుమానితుడిని గుర్తించినా తాను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. నేను వారిని ఎదుర్కోవాలనుకోవడం లేదు. నా వల్ల మరొకరు ఇబ్బంది పడకూడని తెలిపారు. కాగా లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటివరకు అనుమానితుడి వివరాలు బయటకు రాలేదు. ఈ సంఘటన AI పై వ్యాపార రంగంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భయాలు మళ్లీ బయటకు తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications