silicon valley: ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నాయి. కొన్ని దేశాలు మాంద్యంలోకి వెళ్లవచ్చని వివిధ సంస్థలు నివేదికలు సైతం విడుదల చేశాయి. కాగా మరికొన్ని వాటిని కొట్టి పారేస్తూ.. ప్రస్తుతానికి చింతించాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాయి. ఈ సమయంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)సంక్షోభం వెలుగు చూడటంతో.. పరిస్థితి ఏమిటా అని మార్కెట్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. 2008 నాటి మాంద్యం పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని కంగారు పడుతున్నాయి.

B2B SaaS స్పేస్ కంపెనీలే అధికం
అమెరికాకు చెందిన నియంత్రణ సంస్థలు సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఆస్తులను శుక్రవారం రాత్రి సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాంకుతో లావాదేవీలు జరుపుతున్న భారతీయ స్టార్టప్ లు తమ నిధులను మరో బ్యాంకుకు తరలించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్ల సూచన మేరకు మరిన్ని కంపెనీలు సైతం ఇదే బాటలో నడవనున్నట్లు తెలియ వచ్చింది. B2B SaaS స్పేస్ లోని చాలా కంపెనీలు.. SVBలో తమ ఖాతాలను నిర్వహిస్తున్నట్లు iZooto వ్యవస్థాపకులు వివేక్ ఖండేల్వాల్ తెలిపారు.

పాఠం నేర్చుకున్నా..
నిధులను సకాలంలో SVB నుంచి ఇతర బ్యాంకులకు తరలించే అవకాశాలపై హ్యుమాంటిక్ AI వ్యవస్థాపకులు అమర్ ప్రీత్ కాల్కట్ సోషల్ మీడియాలో స్పందించారు. "త్వరలోనే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చని, SVBకి సపోర్ట్ చేయాలని మొదటగా అనుకున్నా.
అనంతరం నాపై ఆధారపడిన 20 మంది జీతభత్యాలు, వినియోగదారులు, పెట్టుబడిదారుల గురించి ఆలోచించాను. తర్వాత రెండు గంటల పాటు.. నిధులను బయటకు ఎలా తరలించాలి అనే సందేహంలో పడ్డాను. చివరగా క్యాపిటల్ ను విభజిస్తూ, రిస్క్ ని తగ్గించుకోవాలన్న గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాను" అని తన భావాలను వ్యక్తపరిచారు.

మోసం లేదా పతనం కాదు
2 లక్షల 50 వేల డాలర్లు కంటే తక్కువ నిధులు కలిగిన స్టార్టప్ ఎకౌంట్లకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా బీమా ఉంది. అంతకంటే ఎక్కువ నిధులు కలిగిన సంస్థల విషయంపై ఇప్పటికీ సందిగ్దత నెలకొంది. సోమవారం మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. SVB వ్యవహారం మోసం కాదు, ఇటీవల జరిగిన FTX క్రిప్టో ఎక్సైజ్ వంటి పతనమూ కాదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications