పండుగ సీజన్లో కార్ల అమ్మకాలపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి కార్ల తయారీదారు సంస్థలు . ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కార్ల అమ్మకాలు 16 శాతం పెరిగాయని చెప్తున్న నేపధ్యంలో పండుగ సేల్స్ పై అంచనాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా అమ్మకాలు తగ్గుతాయని భావిస్తే, కార్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో గతం కంటే పెరిగాయి.

దసరా , దీపావళి పండుగ సేల్స్ పై కార్ల కంపెనీల ఆశలు
కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో మొదట్లో తీవ్ర నష్టాలను చవిచూసిన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ఇప్పుడిప్పుడే నష్టాల నుండి బయట పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ త్రైమాసికం వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి అని భావిస్తున్న కంపెనీలు పండుగ సీజన్లో అమ్మకాలపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి. దసరా, దీపావళి పండుగ సందర్భంగా ఎక్కువ మంది వాహనాలను కొనుగోలు చేస్తారు అని భావిస్తున్న నేపథ్యంలో, కంపెనీలు కార్ల కొనుగోలుపై పలు ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.

ఈ త్రైమాసికంలో కాస్త కోలుకున్న ఆటోమొబైల్స్ రంగం
ఈ పండుగ సీజన్లో అమ్మకాలతో ఆటోమొబైల్ రంగం మరింత కోలుకుంటోందని సియామ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య పేర్కొంది.
2020 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో మొత్తంగా ఆటోమొబైల్ రంగంలో 7,26,232 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి, 2019 సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో 6,20,620 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం లోనే ఎక్కువ వాహనాలు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది.

జూలై-సెప్టెంబర్ కాలంలో 16 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు
జూలై-సెప్టెంబర్ కాలంలో కార్ల అమ్మకాలు చూస్తే 16 శాతం పెరిగాయి. ఈ త్రైమాసికంలో మొత్తం 4,26,316 కార్లు అమ్ముడయ్యాయని , అంతకు ముందు ఏడాది 3,67,696 కార్లు అమ్ముడైనట్లుగా సియామ్ పేర్కొంది .
వాణిజ్య వాహనాల అమ్మకాలు 20 శాతం తగ్గి 1,33,524 యూనిట్లకు చేరుకున్నట్లు డేటా తెలిపింది.
కొన్ని విభాగాలు కోలుకునే సంకేతాలను చూపించాయని , పండుగ సీజన్‌లో మంచి డిమాండ్ ఉందని మేము ఆశిస్తున్నామని త్రైమాసిక గణాంకాలపై వ్యాఖ్యానిస్తూ సియామ్ అధ్యక్షుడు కెనిచి ఆయుకావా అన్నారు. అయితే పండుగ సీజన్ కొనుగోళ్లపై బోలెడు ఆశలు పెట్టుకున్న కార్ల తయారీ సంస్థల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయి అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications