ఈ ఇండియన్ బాస్ రూటే సపరేట్.. ఉద్యోగుల కోసం ఏకంగా 750 మిలియన్ డాలర్ల విరాళం
ఉద్యోగులతో ఎంతో సన్నిహితంగా మెలిగే బాస్ లను చూసే ఉంటాం. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి ఏటా భారీ మొత్తంలో సిబ్బందికి బోనస్ లు ఇచ్చి వారి ప్రేమను వ్యక్తపరచడం విన్నాం. కానీ శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకులు త్యాగరాజన్ అందుకు భిన్నంగా ఆలోచించారు. కనీవిని ఎరుగని రీతిలో తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
దాదాపు తన సంపద మొత్తం అంటే 750 మిలియన్ డాలర్లను ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుకు విరాళంగా ఇచ్చి త్యాగరాజన్ దాతృత్వాన్ని చాటుకున్నారు. కేవలం తన కోసం చిన్న ఇల్లు, 5 వేల డాలర్ల విలువైన కారును మాత్రమే ఉంచుకున్నారు. ఆయనకు కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకపోవడం విశేషం. రుణదాతగా మొదలుపెట్టి చివరికి 30కి పైగా కంపెనీలను శ్రీరామ్ గ్రూప్ కింద ఒకటిగా చేర్చారు.

దేశంలో తక్కువ ఆదాయ వర్గాల వారికి రుణాలు ఇచ్చి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శ్రీరామ్ గ్రూప్ సంస్థను స్థాపించారు. ట్రక్కులు, ట్రాక్టర్లు సహా ఇతర వాహనాలకు రుణాలు అందించడంలో అగ్రగామిగా ఈ కంపెనీ ప్రఖ్యాతిగాంచింది. అనంతరం స్టాక్ బ్రోకింగ్ నుంచి బీమా సేవలు అందించే వరకు అంచెలంచెలుగా ముందుకు సాగింది. ప్రస్తుతం లక్షా 8 వేల మంది శ్రీరామ్ గ్రూపులో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 86 ఏళ్ల త్యాగరాజన్ పలు విషయాలు వెల్లడించారు. క్రెడిట్ కార్డులు, స్థిరమైన ఆదాయం లేని వారికి రుణాలు ఇవ్వడం అనుకున్నంత ప్రమాదకరం కాదని నిరూపించాలనుకున్నట్లు తెలిపారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications