దీపావళి నాటికి బంగారం ధర ఎంత వరకు పడిపోవచ్చు.. పసిడి భవిష్యత్తుపై నిపుణులు ఏమంటున్నారంటే..
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ముడి చమురు సరఫరాపై ఆందోళనలను పెంచడంతో పాటుగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరను ఔన్సుకు సుమారు 4 వేల డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాయి. ఈ అంతర్జాతీయ పతనం ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.43 లక్షల నుండి రూ.1.45 లక్షల మధ్య శ్రేణిలో ట్రేడవుతోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. Gold ధరలు ఇప్పటికే దాదాపు తమ కనిష్ట స్థాయికి (బాటమ్) చేరుకున్నాయి. ప్రస్తుత స్థాయిల నుండి గరిష్టంగా మరో 5 శాతం వరకు మాత్రమే పతనం ఉండవచ్చని.. అంతకంటే భారీగా పడిపోయే అవకాశం చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలలో ఈ బలహీనతకు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పాటుగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం కూడా ఒక ముఖ్య కారణంగా చూడవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించవచ్చనే భయం ఇన్వెస్టర్లలో ఉంది.
బంగారంపై ఎలాంటి వడ్డీ లభించదు కాబట్టి.. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు దీనిపై కంటే ఇతర స్థిర రాబడి సాధనాల వైపు మొగ్గు చూపుతారు. అయినప్పటికీ ప్రస్తుత మార్కెట్ Consolidation దశలో ఉన్నందున సామాన్య కొనుగోలుదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశీయ కొనుగోలుదారులకు.. ముఖ్యంగా రాబోయే పెళ్లిళ్లు, పండుగల కోసం gold ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయనే ఆశతో కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదని.. ఎందుకంటే దేశీయ మార్కెట్‌లో రూ. 1.35 లక్షల వద్ద బంగారానికి చాలా బలమైన మద్దతు (పునాది) ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
గతంలో బంగారం ధరలు పెరిగినప్పుడు ఆభరణాల డిమాండ్ 75 నుండి 80 శాతం వరకు పడిపోగా.. ప్రస్తుత ధరల తగ్గుదల కారణంగా ఆ క్షీణత ఇప్పుడు 40 నుండి 45 శాతానికి పరిమితమైంది. ఇది మార్కెట్ క్రమంగా పుంజుకుంటోందనడానికి సంకేతంగా చూడాలని చెబుతున్నారు. రాబోయే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పండుగ సీజన్ ప్రారంభం కానుండటంతో.. దీపావళి నాటికి ఆభరణాల కొనుగోళ్లు గత ఏడాదితో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక భారతదేశం నుండి విదేశాలకు జరిగే ఆభరణాల ఎగుమతుల విషయానికి వస్తే.. దీనికి అమెరికా రాజకీయ పరిణామాలతో లేదా డోనాల్డ్ ట్రంప్ ప్రకటనలతో ప్రత్యక్ష సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో దిగుమతి సుంకాలు (ఇంపోర్ట్ డ్యూటీ) పెరిగిన తర్వాత.. గల్ఫ్ దేశాలలో (GCC) నివసిస్తున్న ప్రవాస భారతీయులు అక్కడే ఆభరణాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దుబాయ్, పొరుగు దేశాలలో భారత శైలి ఆభరణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ పన్నుల వ్యత్యాసం భవిష్యత్తులో భారతీయ ఎగుమతిదారులకు పరోక్షంగా మంచి ప్రయోజనాన్ని చేకూర్చనుందనే వార్తలు వెలువడుతున్నాయి.
ఇప్పుడు ఇన్వెస్టర్లందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే.. దీపావళి నాటికి Gold ధర ఎటువైపు వెళ్తుంద అనేది.. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఒకవేళ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి పశ్చిమ ఆసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే.. దీపావళి నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధర తిరిగి పుంజుకుని ఏకంగా రూ. 1.60 లక్షల మార్కును తాకవచ్చు.
ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినప్పటికీ.. ధరలు పెద్దగా పడిపోకుండా రూ. 1.40 లక్షల నుండి రూ. 1.45 లక్షల పరిధిలోనే స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు 4 వేల డాలర్ల వద్ద బంగారానికి బలమైన సపోర్ట్ ఉంది. కాబట్టి మున్ముందు 5,100 డాలర్ల స్థాయిని అందుకోవడమే పసిడి తదుపరి లక్ష్యం కానుంది. బంగారంతో పాటు వెండి కూడా రాబోయే రోజుల్లో మంచి పురోగతి సాధిస్తుందని మార్కెట్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
