బోసిపోయిన మార్కెట్స్..మాల్స్: స్తంభించిన రూ.వందల కోట్ల లావాదేవీలు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి దేశంలో పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతోన్నాయి. లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండోరోజు కూడా దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటేసింది. అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడు కావడంతో పరిస్థితులు మరింత అల్లకల్లోలంగా తయారయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఈ వేరియంట్ ప్రధాన కారణమైంది.
శుక్రవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల 1,17,096 కాగా.. ఇవ్వాళ ఈ సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 1,41,986కు చేరింది. 285 మంది మరణించారు. 3,44,12,740 మంది రికవరీ అయ్యారు. 4,83,463 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 4,72,169గా నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇక్కడితో ఆగుతుందనే గ్యారంటీ ఎంతమాత్రం లేదు. రోజు తిరిగే సరికి వేలల్లో కొత్త పాజిటివ్ కేసులు జత అవుతున్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లోనూ పెరుగుదల కనిపించింది. 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటిదాకా 3,071 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో 1,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 876 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ-513, కర్ణాటక-333, రాజస్థాన్-291, కేరళ-284, గుజరాత్-204, తెలంగాణ-123, తమిళనాడు-121, హర్యానా-114 కేసులు ఉన్నాయి.

కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్స్‌ను నియంత్రించడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలను విధించుకున్నాయి. వీకెండ్ కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చాయి. నైట్ కర్ఫ్యూను విధించాయి. ఫలితంగా- మరోసారి దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల ఆర్థిక వ్యవస్థకు దెబ్బకొడుతుందనే ఆందోళనలు లేకపోలేదు.
నిత్యం వందలాది మంది కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయే మార్కెట్లన్నీ కళతప్పాయి.. బోసి పోయాయి. దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధాని సహా అన్ని ప్రధాన నగరాల్లో షాపింగ్ మార్కెట్లు, మాల్స్, కాంప్లెక్స్, మల్టీ ప్లెక్సులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ రెండు రోజుల పాటు అవి తెరచుకోవు. దుస్తుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ వీకెండ్ కర్ఫ్యూ ప్రభావం రిటైల్ వ్యాపారులపై తీవ్రంగా పడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
వరుసగా మూడో సంవత్సరం కూడా కోవిడ్ వెంటాడటం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన 2020లో దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘమైన లాక్‌డౌన్ వల్ల చిరు వ్యాపారులు, రిటైలర్లు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇవే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది మరణానికి కారణమైందీ సెకెండ్ వేవ్. సెకెండ్ వేవ్ సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపింది. రోజుల తరబడి వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి.
ఇప్పుడు కూడా అవే స్థితులు దేశంలో నెలకొన్నాయి. ఇది వరుసగా మూడో సంవత్సరం. ఈ దఫా ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కోవిడ్ కొత్తగా విరుచుకుపడుతోంది. లక్షన్నర వరకు కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీన్ని నియంత్రించడానికి ఆంక్షలను విధించడం వల్ల మళ్లీ వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications