IT News: టెక్కీలకు బ్యాడ్‌న్యూస్.. ఇక మీ స్థానంలో ఏఐ, తెగేసి చెప్పిన టెక్ కంపెనీ సీఈవో..
AI Effect: ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అమెరికాకు చెందిన మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఏఐ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. మధ్య స్థాయి సాఫ్ట్ వేర్ డెవలపర్ల విషయంలో కీలక కామెంట్స్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీరి స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలదని వెల్లడించారు. కోడింగ్ చేసే ఐటీ ఉద్యోగుల భవితవ్యాన్ని ఏఐ పూర్తిగా మార్చేయగలదని, వారి ఉద్యోగ అవకాశాలను మాయం చేస్తుందనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలో 2025 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఏడాది చివరి నాటికి మెటా సహా ప్రపంచంలోని ఇతర టెక్ కంపెనీలలో ప్రస్తుతం కోడింగ్ చేస్తున్న మిడ్-లెవల్ ఇంజనీర్‌లను సమర్థవంతంగా ఏఐ భర్తీ చేయగలదని పేర్కొన్నారు. ఒక విధంగా కంపెనీ ఏఐ వినియోగంలో మరింత ముందుకు సాగనున్నట్లు మెటా సీఈవో వెల్లడించారు. అయితే ఈ చర్య సమీప భవిష్యత్తులో కంపెనీలో మరిన్ని లేఆఫ్స్ కి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే టెక్ కంపెనీలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను ఎలా చేరుకుంటాయనే దానిపై ఇది పెద్ద మార్పును సూచిస్తుంది.
ప్రస్తుతం మెటా తన ఆధీనంలో ఉన్న వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్ లలో ఏఐ కోడింగ్ చేసే స్థితికి చేరుకున్నట్లు మార్క్ పేర్కొన్నారు. ఇది కంపెనీలో ఆరెంకల జీతం పొందుతున్న మధ్యస్థాయి టెక్కీలకు శాపంగా మారనుందని తెలుస్తోంది. అయితే దీనివల్ల కంపెనీకి గణనీయంగా ఖర్చులు తగ్గనున్నట్లు మెటా యాజమాన్యం భావిస్తోంది. అయితే ఇప్పటికే గూగుల్, ఐబీఎం వంటి టాప్ టెక్ దిగ్గజాలు ఏఐపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీలు ఒక వంతుకుపైగా పనిని ఏఐ సాయంతో పూర్తి చేస్తున్న వేళ మెటా కూడా అదే దారిలో వెళుతోంది. ఇది సాంప్రదాయ కోడింగ్ ఉద్యోగాలను తొలగించగలదు.
అంటే రానున్న కాలంలో ఏఐ నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను మాత్రమే ఇంజనీర్లు పరిష్కరిస్తారని తెలుస్తోంది. మెటా దాని ఏఐ ప్రయాణంలో ఒంటరిగా లేదు. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన క్లార్నా కూడా ఏఐ-ఆధారిత ఆటోమేషన్‌కు మద్దతునిచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా.. తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. మార్క్ ఏఐ గురించి కీలక కామెంట్స్ చేసిన సమయంలోనే ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన కీలక ప్రకటన రావటం ఆందోళనలు పెంచుతోంది.


Click it and Unblock the Notifications