Bengaluru: బెంగళూరు వాసులకు హెచ్చరిక.. బయట తింటే మీ ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం..!
బిజీ లైఫ్ లో కొంత మంది చాలా వరకు బయట తింటుంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే.. వారు బయటే ఎక్కువ తింటారు. అయితే బయట తినేవారి ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని తెలుస్తోంది. దాదాపు చాలా హోటళ్లు, ఫుడ్ కోర్టులు సరైన ప్రమాణాలు పాటించడం లేదు. కలుషిత ఆహారాన్ని మసాలాలు వేసి వేడి వేడిగా అందిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని పలు ఉన్నత స్థాయి హోటళ్లలో ప్రత్యేక ఆహార భద్రతా తనిఖీ డ్రైవ్ సందర్భంగా కూరగాయలపై బూజు పట్టడం, గడువు ముగిసిన పాలు, ఇతర ఆహార ఉత్పత్తులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఆహార భద్రత మరియు ఔషధ పరిపాలన శాఖ బెంగళూరు వ్యాప్తంగా 26 త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్లను తనిఖీ చేసింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలిక పరిధిలోని అన్ని జోన్‌లను కవర్ చేస్తూ, ఆహార భద్రతా అధికారుల ముప్పై బృందాలు శుక్రవారం (ఆగస్టు 7) తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడులలో వంటగదులు, ఆహార నిల్వ ప్రదేశాలలో అపరిశుభ్రమైన పరిస్థితులు, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు, ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోవడం వంటి అనేక ఆహార భద్రతా లోపాలు బయటపడ్డాయి. బూజు పట్టిన కూరగాయలు, ఆహార పదార్థాలను కూడా అధికారులు గుర్తించారు. ఒక హోటల్‌లోని వంట సిబ్బంది బేక్ చేసిన వస్తువులతో నిండిన ట్రేను చెత్తబుట్టలో పారవేసే ముందు క్షమాపణలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొన్ని హోటళ్లు శాకాహారం, మాంసాహార వంటకాలను వేరువేరుగా ఉంచడం లేదని కూడా అధికారులు గుర్తించారు. తప్పుడు లేబులింగ్, ఆహార పదార్థాలపై తప్పుడు బ్రాండింగ్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తప్పనిసరి లేబులింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులు కూడా నమోదు చేశారు. గడువు ముగిసిన పాలు, బేకరీ ఉత్పత్తులతో పాటు, చికెన్, చేపలు, మాంసం, కూరగాయలు నిల్వలో ఉన్నట్లు కనుగొన్నారు. అనేక ఫైవ్-స్టార్ హోటళ్లలో సురక్షితం కాని ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ది లలిత్ అశోక్ (అనెక్స్ సౌత్)లో అధికారులు 76 కిలోల మాంసం, 200 కిలోల కూరగాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ గడువు ముగిసిన 32 లీటర్ల పాలను కూడా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
షాంగ్రి-లా బెంగళూరులో 15 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోగా, ఫోర్ సీజన్స్ హోటల్ బెంగళూరులో 19 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివాంత బెంగళూరు వైట్‌ఫీల్డ్ నుండి 3 కిలోల గడువు ముగిసిన బేకరీ ఉత్పత్తులను, తాజ్ యశ్వంత్‌పూర్ నుండి 72 కిలోల మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ది రాడిసన్ బ్లూ (ది ఆత్రియా)లో అత్యధికంగా 105 కిలోల గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో 50 కిలోల చికెన్, 23 కిలోల మాంసం, 7 కిలోల చేపలు, 25 కిలోల కూరగాయలు ఉన్నాయి.
ఈ తనిఖీలో మొత్తం 35 ఆహార నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం ఆహార ప్రయోగశాలకు పంపారు. నమూనాలలో టీ పొడి, చికెన్, మటన్, చేపలు, వంట నూనె, కారం పొడి, పసుపు పొడి, టమాటో సాస్, నిమ్మరసం, చీజ్, పాపడ్, జీడిపప్పు, అల్లం, మిరియాల పొడి, మసాలా పొడి, పాలు ఉన్నాయి. ఆహార భద్రతా లోపాలపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తీవ్రంగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో బెంగళూరులో ఈ తనిఖీలు జరిగాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications