Credit Card: ఆర్బీఐ తాజా నిర్ణయం.. క్రెడ్-ఫోన్ పే కస్టమర్లకు షాక్.. పూర్తి వివరాలివే..
CRED-PhonePe: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శక్తికాంత్ దాస్ నేతృత్వంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఈ సారి ఆ ప్రభావం ఫిన్ టెక్ కంపెనీలతో పాటు క్రెడిట్ కార్డ్ యూజర్లపై కూడా పడుతోంది.
దేశంలోని ఫిన్‌టెక్ కంపెనీలై ఫోన్ పే, క్రెడ్, బిల్ డెస్క్, ఇన్ఫిబీమ్ అవెన్యూస్ వంటి సంస్థలపై ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రభావం ప్రతికూలంగా పడుతోంది. రిజర్వు బ్యాంక్ ప్రస్తుతం దేశంలోని క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను ఆర్బీఐ కేంద్రీకృత బిల్లింగ్ నెట్‌వర్క్ ద్వారా మళ్లించాలని అన్ని ఫిన్‌టెక్, బ్యాంకింగ్ సంస్థలను ఆదేశించింది. కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి.

దేశంలోని క్రెడిట్ కార్డుల వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలైన యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం ఆర్బీఐ పేర్కొన్న విధంగా BBPSని ప్రారంభించలేదు. వాస్తవానికి ఈ బ్యాంకులు సంయుక్తంగా దేశంలో దాదాపు 5 కోట్ల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కస్టమర్లకు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 30 లోపు అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(BBPS) ద్వారా పూర్తి చేయాలని ఇప్పటికే రిజర్వు బ్యాంక్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
వాస్తవానికి ఫోన్ పే, క్రెడ్ వంటి ఫిన్ టెక్ కంపెనీలు ఇప్పటికే బీబీపీఎస్ సభ్యులుగా ఉన్నప్పటికీ.. క్రెడిట్ కార్డులను జారీ చేసిన ఆర్థిక, బ్యాంకింగ్ సంస్థలు తమ తరఫు నుంచి ఆదేశాలను పాటించనందున జూన్ 30 తర్వాత సదరు ఫిన్ టెక్ సంస్థలు బిల్లులను ప్రాసెస్ చేయలేవని వెల్లడైంది. ఈ ఫిన్‌టెక్‌లు సజావుగా నడవాలంటే రుణదాతలు జూన్ 30లోపు RBI నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అయితే ఆర్బీఐ తన నిబంధనను పాటించేందుకు 90 రోజులు గడువు కావాలని ఒక ప్రధాన చెల్లింపుల సంస్థ సీఈవో కోరినట్లు తెలుస్తోంది.
దేశంలో క్రెడిట్ కార్డులను జారీ చేయటానికి అధికారం ఉన్న 34 బ్యాంకుల్లో కేవలం 8 మాత్రమే ప్రస్తుతానికి BBPSలో బిల్లు చెల్లింపులను ప్రారంభించాయని తెలుస్తోంది. వీటిలో ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, బీఓబీ కార్డ్స్ ఉన్నాయి. వాస్తవానికి సెంట్రలైజ్డ్ సిస్టం నుంచి బిల్లుల చెల్లింపులను ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ ఆదేశించటానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. మోసపూరిత లావాదేవీలను గుర్తించి వాటిని ఆపడం ప్రధానమైనదిగా ఉంది. దీనికి తోడు చెల్లింపు విధానాలపై సెంట్రల్ బ్యాంక్‌కు మరింత అవగాహన కల్పించాలని కూడా భావిస్తున్నట్లు పరిశ్రమలో వ్యక్తులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications