adani: అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ప్రభుత్వ సీల్డ్ కవర్ తీసుకునేందుకు ససేమిరా !!
adani: హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల అదానీ గ్రూపుపై చెలరేగిన ప్రకంపనలు ఇప్పుడే ఆగేలా కనిపించడం లేదు. లక్షల కోట్ల మేర ప్రజలు తమ పెట్టుబడులు నష్టపోతే, ప్రభుత్వం అసలేమీ జరగనట్లు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పార్లమెంటును స్తంభింపచేశాయి. అయినా కేంద్రం దిగిరాకపోవడంతో, ఈ వ్యవహారం కాస్త సుప్రీం కోర్టుకు చేరింది. మరోపక్క అదానీ వ్యవహారంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, విదేశీ బిలియనీర్ సోరోస్ మధ్య ఘాటు విమర్శలు చోటుచేసుకున్నాయి.

కోర్టు ఆగ్రహం:
అదానీ ఉదంతం తరహా నష్టాల నుంచి ఇన్వెస్టర్లను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ కమిటీ వేయాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. అయితే దానిలో మెంబర్ల జాబితాను సూచించాలని ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు ప్రభుత్వం సూచించిన వ్యక్తుల పేర్లను ఓ సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించడంపై.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు కమిటీ ఎలా అవుతుంది?
అత్యున్నత న్యాయస్థానంలో ఈరోజు విచారణ మొదలుకాగానే, సీల్డ్ కవర్ ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి సమర్పించారు. మార్కెట్ పై ప్రభావం పడకుండా నిజాలు బయటకు తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే న్యాయమూర్తులు దాన్ని తిరస్కరించారు. పారదర్శకంగా విచారణ జరపాలని భావిస్తున్నామని, సీల్డ్ కవర్ లో సూచిస్తే అది కేంద్ర కమిటీ అవుతుంది కానీ కోర్టు
నియమించిన కమిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

మేమే చూసుకుంటాం:
ఈ విషయంపై విచారణ జరపడానికి తామే ఓ కమిటీని నియమిస్తామని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. దాని సభ్యులనూ తామే నామినేట్ చేయనున్నట్లు పేర్కొంది. పనితీరు, పరిధిని సైతం నిర్దేశించనున్నట్లు వెల్లడించింది. వ్యాజ్యంపై తదుపరి ఆదేశాలను రిజర్వ్ చేసింది.

స్మృతీ ఇరానీ vs జార్జి సోరోస్:
మరోవైపు అదానీ వ్యవహారంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బిలియనీర్ జార్జి సోరోస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయాలని.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ను నిండా ముంచిన ఆర్థిక నేరస్థుడు సోరోస్ చూస్తున్నట్లు స్మృతీ ఆరోపించారు. అయితే తనకు ఎటువంటి దురుద్దేశం లేదని.. విదేశీ పెట్టుబడిదారులు, పార్లమెంటు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోడీకి ఉందని సోరోస్ బదులిచ్చారు.


Click it and Unblock the Notifications