భారతదేశ అణు విద్యుత్ రంగం (Nuclear Power Sector) ఒక ముఖ్యమైన మార్పుకి సిద్ధమైంది. దేశంలో ఇంధన అవసరాలకు తగ్గట్టుగా కొత్త మార్గాలను ఓపెన్ చేస్తూ కేంద్ర మంత్రివర్గం తాజాగా 'అటామిక్ ఎనర్జీ బిల్లు, 2025' కు ఆమోదం తెలిపింది. ఈ చారిత్రక బిల్లుకు 'శాంతి' (SHANTI - Sustainable Harnessing of Advancement of Nuclear Energy for Transforming India) అనే పేరు పెట్టారు. ఈ బిల్లు వల్ల ఎలాంటి మార్పులు రానున్నాయంటే..

"శాంతి" బిల్లు (SHANTI Bill).. వల్ల దేశ ఎకానమీలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎనర్జీ రంగంలో భారీ మార్పులు రానున్నాయి. న్యూక్లియర్ పవర్ రంగంలో ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఇవ్వడం ద్వారా దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. 2047 నాటికి 100 GW అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ బిల్లు చాలా కీలకం అని ప్రభుత్వం చెప్తోంది. 'శాంతి' బిల్లు అణు విద్యుత్ రంగానికి ఒకే సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.
ప్రైవేట్ కంపెనీలకు తెరవబడే ముఖ్య రంగాలు..
ఈ బిల్లు ద్వారా ప్రైవేట్ కంపెనీలకు అణు ఖనిజాలను వెలికితీయడానికి, త్రవ్వడానికి అనుమతి లభిస్తుంది. అలాగే అణు రియాక్టర్లకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేయడం వంటి కీలకమైన రంగాలు కూడా ప్రైవేట్‌కు అందుబాటులోకి రానున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల అంతరిక్ష రంగంలో చేపట్టిన సంస్కరణల మాదిరిగానే అణు రంగంలో కూడా ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంస్కరణ ఇంధన భద్రతకు, సాంకేతిక నాయకత్వానికి కొత్త శక్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
భద్రత ఎలా?
ప్రభుత్వం ఈ కొత్త బిల్లుతో పాటు ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. న్యూక్లియర్ పవర్ కు సంబంధించి వచ్చే వివాదాలను ఈ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ (IAEA) తో కలిసి పనిచేయడానికి ఒక ప్రత్యేక అణు భద్రత అథారిటీని కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న అటామిక్ ఎనర్జీ చట్టంలో కూడా కొన్ని సవరణలు చేపట్టనున్నారు. ఈ సవరణలు ప్రైవేట్ రంగ పెట్టుబడిని మరింత ప్రోత్సహించడానికి దోహదపడతాయి.
త్వరలోనే అమల్లోకి..
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉన్న ఈ బిల్లు త్వరలోనే అమలు అయ్యే అవకాశం ఉంది. ఈ బిల్లు భారతదేశ ఇంధన భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (SMR), అధునాతన రియాక్టర్లు, అణు ఆవిష్కరణలలో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి. తద్వారా దేశంలో ఎనర్జీ రంగం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వీటిపై ఆధారపడే స్పేస్, రీసెర్చ్, డిఫెన్స్, రైల్వై వంటి రంగాలు కూడా లాభపడతాయి.


Click it and Unblock the Notifications