Shantanu Naidu: రతన్ టాటా ఈ పేరు విన్న ప్రతి భారతీయుడికి ముందు గుర్తుకొచ్చేది ఆయన మంచితనమే. భౌతికంగా రతన్ టాటా మన మధ్య లేకపోయినప్పటికీ కోట్లమంది యువతకు ఆయన ప్రయాణం ఒక ఆదర్శం. ఆయన మరణం గత ఏడాది యావత్ దేశాన్ని బాధించిందని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు. అయితే టాటాకు చివరి వరకు ఉన్న యువ స్నేహితుడు శంతను నాయుడు అని మందరికీ తెలిసిందే.
రతన్ టాటా శంతను నాయుడికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చేవారు, ఎలా చూసుకునేవారో మనందరికీ తెలిసిందే. మరణించిన తర్వాత టాటా వీలునామాలో శంతను నాయుడు విదేశాల్లో చదువు కోసం రుణంగా తీసుకున్న మెుత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సహాయకుడిగా పనిచేసిన శంతను నాయుడుకి ప్రస్తుతం పెద్ద బాధ్యత లభించింది. ఈక్రమంలో నాయుడు టాటా సన్స్ లో దాదాపు 6 ఏళ్లు పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్ (వ్యూహాత్మక కార్యక్రమాలు) పాత్రను చేపట్టారు.

ప్రముఖ ఫ్లాట్ ఫారమ్ లింక్డ్ఇన్‌లో దీనికి సంబంధించిన వివరాలను పంచుకుంటూ.. తాను చిన్నప్పుడు తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్ నుండి తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని కోసం కిటికీ వద్ద వేచి ఉండేవాడిని, ఇప్పుడు ఇది మళ్లీ తిరిగి వచ్చిందన్నాడు. వాస్తవానికి శంతను నాయుడు తండ్రి పూణే టాటా మోటార్స్ ప్లాంటులో పనిచేయగా.. తాత, ముత్తాతలు టాటాపవర్ కంపెనీలో సేవలు అందించారు. అందుకే వారి కుటుంబానికి టాటా సంస్థలతో విడదీయలేని బంధం ఏర్పడింది.
రతన్ టాటా వద్ద పనిచేస్తున్న సమయంలో నాయుడు టాటా సన్స్ నుంచి వేతనం అందుకునేవాడు. కానీ ప్రస్తుతం అది టాటా మోటార్స్ కి బదిలీ చేయబడిందని తెలుస్తోంది. కంపెనీ తన అంతర్గత ప్రతిభను అవసరాల మేరకు ఇతర టాటా కంపెనీల్లోకి మారుస్తూ ఉంటుందని మనందరికీ తెలుసు. ఇది కేవలం నాయుడు విషయంలో మాత్రమే జరగలేదని గమనించాలి. ఉదాహరణకు టాటా సన్స్‌కు చెందిన సందీప్ త్రిపాఠి టాటా క్యాపిటల్‌కు మారడం, టాటా సన్స్‌లో ప్రత్యేక ప్రాజెక్టులను టాటా డిజిటల్‌కు చెందిన ప్రతీక్ పాల్ చేపట్టడం వంటివి గతంలోనూ జరిగాయి.
ఒక్క సంఘటన సంతను నాయుడిని రతన్ టాటాకు దగ్గర చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత టాటా టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ ప్రారంభించాడు సంతను నాయుడు. ఆ సమయంలో కుక్కలను రాత్రిపూట రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించటానికి వాటికి రేడియం కాలర్ బెల్టులు అమర్చాలని నిర్ణయించుకున్నాడు. అయితే తానొక్కడే పెద్ద స్థాయిలో దీనిని చేయలేక సహాయం కోసం రతన్ టాటాకు ఒక లేఖ రాశాడు. ఆ సమయంలోనే టాటా దృష్టి నాయుడిపై పడింది. దీని తర్వాత రతన్ టాటా-శంతను నాయుడు మంచి మిత్రులుగా మారారు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదివేందుకు నాయుడికి అయిన ఖర్చులను కూడా టాటా ట్రస్ట్ భరించింది. పైగా స్నాతకోత్సవానికి నాయుడు కోసం రతన్ టాటా ఏకంగా అమెరికాకు కూడా వెళ్లటం అప్పట్లో పెద్ద సంచలన విషయంగా వార్తల్లోకి ఎక్కింది.


Click it and Unblock the Notifications