క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ తనదైన శైలిలో స్పందించారు. క్రిప్టో భారత స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా పరిమణించిందని, ఇప్పటికే డిజిటల్ కాయిన్స్‌ను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు సొంతగా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, కేంద్ర బ్యాంకు సామర్థ్యం పైన ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు ఓ సూచన చేశారు. ఈ అసెట్స్‌కు ఎలాంటి అంతర్లీనత లేదని, ఇది కనీసం తులిప్ కూడా కాదని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ గవర్నర్ ఎంపీసీ సమావేశ నిర్ణయాలను గురువారం మీడియాకు తెలిపారు.

నిర్మలమ్మ మాట
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. క్రిప్టో ఆస్తుల లాభాలపై, ట్రాన్సాక్షన్స్ పైన 30 శాతం పన్ను ఉంటుందని నిర్మలమ్మ ప్రకటించారు. అంతేకాదు, 2023 నాటికి ఆర్బీఐ దేశంలో మొదటి అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు డిజిటల్ కరెన్సీపై మొదటి నుండి ఆందోళన వ్యక్తం చేస్తున్న, ఆర్బీఐ తాజాగా మరోసారి స్పందించింది.

తులిప్ మానియా
ప్రయివేటు క్రిప్టో కరెన్సీలు లేదా వాటిని ఏ పేరుతో పిలిచినప్పటికీ అవి ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతాయని, ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ చర్యలను, సామర్థ్యాలను అవి బలహీనపరుస్తాయని తెలిపారు. మీ సొంత పూచీకత్తుపై ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని తేల్చి చెప్పారు. ఇలా చెప్పడం తన బాధ్యత అన్నారు. క్రిప్టో అంతర్లీనంగా ఎలాంటి ఆస్తి కాదన్నారు. ఈ సందర్భంగా 17వ శతాబ్దంలో చోటు చేసుకున్న తులిప్ మానియాతో పోలుస్తూ శక్తికాంతదాస్ వ్యాఖ్యానించారు.

పెరిగింది.. కుప్పకూలింది
ఆస్తులు, మార్కెట్ లేదా రియాల్టీ వంటి రంగాలు కొన్నిసార్లు వాస్తవ విలువను అధిగమించి, పరుగులు పెడుతాయి. దీనిని ఫైనాన్షియల్ బబుల్ అంటారు. అలాంటి ఫైనాన్షియల్ బబుల్స్ గురించి ఉదహరించే సమయంలో ఈ తులిప్ మానియాను ప్రస్తావించడం జరుగుతుంది. తులిప్ మానియా 17వ శతాబ్దంలో చోటు చేసుకుంది. డచ్ ఇన్వెస్టర్లు తులిప్ పువ్వులపై ఇన్వెస్ట్ చేయడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. ఇలా మూడేళ్ల పాటు ఊహించని విధంగా ధరలు విపరీతంగా పెరిగి, తర్వాత కుప్పకూలాయి.


Click it and Unblock the Notifications